ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు తమ బ్యాటింగ్ పవర్‌ను చూపించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు సైమ్ అయూబ్ (0), షఫీక్ (0) డకౌట్‌గా వెనుదిరిగినా.. ఆ తర్వాత అజాన్ అవైస్ (59), షాన్ మసూద్ (95), కెప్టెన్ బాబర్ ఆజం (75) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అయితే ఈ ముగ్గురు కీలక బ్యాటర్లు అవుటయ్యాక పాకిస్తాన్ త్వరగానే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు.
రజావుల్లా ఊచకోత..!
కానీ అసలు కథ అక్కడే మొదలైంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ఆటగాడు రజావుల్లా విధ్వంసం సృష్టించాడు. టీ20 ఫార్మాట్ రీతిలో విరుచుకుపడుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. పదో నంబర్ బ్యాటర్ అబ్బాస్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో రజావుల్లా కేవలం 43 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొన్న అతడు 4 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 81 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. రజావుల్లా, అబ్బాస్ కలిసి తొమ్మిదో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ తరఫున 1984 తర్వాత తొమ్మిదో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.
ఇక ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రజావుల్లా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సరసన నిలిచాడు. 2023 యాషెస్ సిరీస్‌లో లార్డ్స్ వేదికగా స్టోక్స్ 9 సిక్సర్లు కొట్టగా, రజావుల్లా కూడా ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లతో ఆ రికార్డును సమం చేశాడు.
అదేవిధంగా టెస్ట్ అరంగేట్రంలో పాకిస్తాన్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా రజావుల్లా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఫహీమ్ అష్రఫ్ పేరిట ఉండేది. 2018లో ఐర్లాండ్‌పై ఫహీమ్ అష్రఫ్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో అష్రఫ్ రికార్డును రజావుల్లా బ్రేక్ చేశాడు. బౌలింగ్‌లో కూడా అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ విజయ లక్ష్యం@130
బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల భారీ స్కోర్ సాధించగల్గింది. దీంతో పర్యాటక జట్టు ఆతిథ్య ఇంగ్లండ్ ముందు కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో మ్యాచ్ పూర్తి అయ్యే అవకాశముంది.


