పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీలో తీవ్ర నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు అనుహ్యంగా పాక్ జట్టులోకి వచ్చిన అయూబ్.. తన లభించిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ ఆఖరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు డకౌట్ అయ్యాడు.
రెండు సార్లు కూడా ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లోనే అతడు అవుట్ కావడం గమనార్హం. వాస్తవానికి తొలుత ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో అయూబ్‌కు చోటు దక్కలేదు. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసింది.
దీంతో కరేబియన్ లీగ్‌లో ఆడుతున్న అయూబ్‌ను వెంటనే ఇంగ్లండ్‌లో ఉన్న పాక్ జట్టుతో కలవాలని పీసీబీ ఆదేశించింది. దీంతో అతడు ఉన్నపళంగా యూకేకు వెళ్లి ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టుతో కలిశాడు. ఇమామ్ ఉల్ హక్ స్ధానంలో ఓపెనర్‌గా అతడికి తుది జట్టులో అవకాశముంది. కానీ అతడు కూడా దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. "సైమ్ అయూబ్‌ను చివరి టెస్టుకు ఎంపిక చేయడం ఒక తెలివితక్కువ నిర్ణయం. ఎందుకంటే అతడు నేరుగా కరేబియన్ టీ20 లీగ్ నుంచి వచ్చి ఇక్కడ బరిలోకి దిగాడు. టీ20 ఫార్మాట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఎలాంటి సరైన సన్నాహకాలు లేకుండా, కొంతకాలంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడని ప్లేయర్‌ను ఇంగ్లండ్ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఆడించారో అర్థం కావడం లేదు.
ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా 'డ్యూక్స్' బాల్‌తో, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ వంటి పటిష్టమైన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను అతడు ఎలా ఎదుర్కొంటాడని సెలెక్టర్లు భావించారో తెలియదు. టెస్టు క్రికెట్ అత్యంత కఠినమైన ఫార్మాట్.
అంతేకాకుండా ఇంగ్లండ్ కండిషన్స్‌లో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రపంచంలో ఏదో మూల టీ20 ఆడుతున్న వ్యక్తిని ఉన్నపళంగా రప్పించి 'గుడ్ లక్' అని మ్యాచ్‌లోకి దింపడం టెస్టు క్రికెట్‌ను అవమానించడమే.
గతంలో భారత్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఒక టెస్టు సిరీస్ కోసం వీరేంద్ర సెహ్వాగ్‌ను ప్రత్యేకంగా ఇంగ్లండ్‌కు రప్పించారు, కానీ అతడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయ్యాడు. నిజానికి అయూబ్ కంటే సెహ్వాగ్ ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటర్. అయినప్పటికీ సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇంగ్లండ్ కఠిన పరిస్థితుల్లో రాణించలేకపోయాడు" అని స్కై స్పోర్ట్స్ డిబేట్‌లో హుస్సేన్ పేర్కొన్నాడు.


