మూడో సీడ్‌గా ఆసియా క్రీడల బరిలోకి
అభయ్ సింగ్‌కు రెండో సీడ్ కేటాయింపు
న్యూఢిల్లీ: భారత యువ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఆసియా క్రీడల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ వరుస టైటిల్స్ సాధిస్తున్న 18 ఏళ్ల అనాహత్ .. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. తద్వారా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడల మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో అనాహత్‌కు మూడో సీడ్ దక్కింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ అభయ్ సింగ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఈ ఏడాది జూలై 13 నాటి ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆసియా క్రీడల నిర్వాహకులు గురువారం ‘సీడ్’లు కేటాయించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం గెలిచిన ప్లేయర్లు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించనున్నారు. దీంతో ఈ గేమ్స్‌లో పోటీ మరింత తీవ్రతరం కానుంది. జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన అనాహత్... ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనాహత్‌కు ఏషియన్ గేమ్స్‌లో మలేసియా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ శివసంగరి సుబ్రమణియం, జపాన్‌కు చెందిన ఆరో ర్యాంకర్ సతోమి వతనాబెతో ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లండన్ క్లాసిక్ క్వార్టర్ ఫైనల్లో శివసంగరి చేతిలో అనాహత్ ఓటమి పాలైంది. కాగా... అనాహత్ ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే సింగిల్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు అందని ద్రాక్షలా ఊరిస్తున్న పసిడి పతకం ఈసారి దరిచేరే అవకాశాలున్నాయి. ఇక మహిళల సింగిల్స్‌లో పోటీ పడుతున్న మరో భారత ప్లేయర్ తన్వీ ఖన్నాకు ఏడో సీడ్ లభించింది.
పురుషుల సింగిల్స్‌లో అభయ్‌కు రెండో సీడ్ దక్కగా... వీర్ చొత్రాని నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. వరుసగా ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న సీనియర్ ప్లేయర్ జోష్నా చినప్ప... మిక్స్‌డ్ డబుల్స్, మహిళల టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది. అభయ్, వీర్, సెంథిల్‌కుమార్, సూరజ్ కుమార్ చంద్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు టాప్ సీడ్ దక్కగా... అనాహత్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు, మిక్స్‌డ్ డబుల్స్ జోడీ పసిడి పతకాలు గెలిచాయి.


