ఈ ఏడాది అక్టోబర్‌లో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా లభించనుంది. ఒకవైపు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఒక భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మరో జట్టు తలపడనుంది. ఏషియన్ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్ ఆడనుంది. పతక పోరు (ఫైనల్, మూడో స్థానం మ్యాచ్) అక్టోబర్ 3న జరగనుంది.
ఇదే సమయంలో వెస్టిండీస్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. తొలి రెండు వన్డేలు సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరగనుండగా.. ఆఖరి వన్డే అక్టోబర్ 3న షెడ్యూల్ అయింది. అయితే భారత్ ఒకవేళ ఆసియా క్రీడల్లో ఫైనల్/మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తే.. అక్టోబర్ 3న ఒకే రోజు వేర్వేరు వేదికలపై రెండు భారత జట్లు ఆడే అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
శ్రేయస్ అయ్యర్ దూరం
కాగా ఆసియా క్రీడల బాధ్యతల కారణంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాటిదార్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కూడా అతడు దుమ్ములేపాడు. శ్రేయాస్ లాగే మిడిలార్డర్‌లో రాణించే సత్తా పాటిదార్ ఉంది.
మరోవైపు ఆసియా క్రీడల కోసం పయనమవుతున్న భారత క్రీడాకారుల బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెట్లు, క్రికెట్ జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పసిడి పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడలకు భారత పురుషల జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.


