మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. మంగళవారం యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.
ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను యూఏఈ బౌలర్లు దెబ్బతీశారు. సురక్ష కొట్టె (3/11), ఇందుజ నందకుమార్ (2/21) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో షార్మిన్ అక్తర్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు), నహిదా అక్తర్ (26 బంతుల్లో 16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి 7వ వికెట్‌కు 42 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేయగలిగింది.
అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ, బంగ్లా బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా స్పిన్నర్ రబేయా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మరుఫా అక్తర్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.
చదవండి: భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే?


