స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్‌ విమర్శలు | Smriti Mandhana Fans Slam Anjum Chopra Over Criticism After Pakistan Match Failure, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్‌ విమర్శలు

Sep 7 2026 1:02 PM | Updated on Sep 7 2026 1:32 PM

Anjum Chopra criticised for questioning Smriti Mandhana after PAK clash

స్మృతి- అంజుమ్‌ (PC: ACC Instagram)

భారత మాజీ క్రికెటర్‌ అంజుమ్‌ చోప్రాపై టీమిండియా స్టార్‌ స్మృతి మంధాన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్మృతి వంటి ప్లేయర్‌ను విమర్శించడం సరికాదని మండిపడుతున్నారు. జట్టు కోసం ఇప్పటికే ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఎంతో చేసిందని.. ఆమె వల్లే జట్టు గెలిచిన సందర్భాలను మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు.

రెండు ప్రపంచ రికార్డులు
ఆసియా మహిళల టీ20 కప్‌-2026లో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన అదరగొట్టిన సంగతి తెలిసిందే. విధ్వసంకర శతకంతో చెలరేగిన ఆమె.. తద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలిచింది. అంతేకాదు... మొత్తంగా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్‌ ఆల్‌టైమ్‌ వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టింది.

పాక్‌తో మ్యాచ్‌లో విఫలం 
అయితే, ఆ తర్వాత పాకిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం స్మృతి మంధాన విఫలమైంది. పాక్‌ విధించిన 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ప్రతికా రావల్‌ (4) దారుణంగా విఫలమయ్యారు.

దీంతో భారత్‌ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (18), దీప్తి శర్మ (12) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే స్మృతి అవుటయ్యే పరిస్థితి (క్యాచ్‌ అవుట్‌) వచ్చింది. అయితే, అంపైర్‌ నిర్ణయంతో ఆమెకు లైఫ్‌ లభించింది.

ఈ నేపథ్యంలో స్మృతి దంచికొడుతుందనుకుంటే.. 11 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించింది. పాక్‌ కెప్టెన్‌ సనా ఫాతిమా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్‌ చేరింది. ఈ క్రమంలో కామెంటేటర్‌గా ఉన్న అంజుమ్‌ చోప్రా స్మృతిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అంజుమ్‌ విమర్శలు
‘‘గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్లేయర్‌ (స్మృతి) ఈసారి తొలి బంతికే అవుటయ్యేది. అంపైర్‌కు స్పష్టత లేకపోవడం వల్ల బతికిపోయింది. కానీ నిజానికి ఆమె అప్పుడే అవుటయ్యేది. కామెంట్రీ బాక్సులో స్టంప్‌ మైకు ఆడియోలో బంతి బ్యాట్‌ను తాకిన శబ్దాన్ని మనం స్పష్టంగా విన్నాము కదా’’ అని అంజుమ్‌ చోప్రా పేర్కొంది.

అదే విధంగా.. ‘‘ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఆ తర్వాత కూడా ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 56 పరుగుల లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ కూడా త్వరగా పెవిలియన్‌ చేరింది. 

ప్రతీసారీ కెప్టెన్‌ వచ్చి పరుగులు చేయాలా?’’ అని అంజుమ్‌ చోప్రా టాపార్డర్‌ను విమర్శించింది. ఈ నేపథ్యంలో స్మృతి అభిమానులు అంజుమ్‌ చోప్రా తీరును విమర్శిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్మృతి లాంటి దిగ్గజాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదంటూ హితవు పలుకుతున్నారు.

చదవండి: టీమిండియాపై విజయం.. పాక్‌ క్రికెట్‌కు శాపంగా మారింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement