చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డులు | Asia Cup 2026: Smriti Mandhana Slams Century Breaks World Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ప్రపంచ రికార్డులు

Sep 3 2026 9:23 PM | Updated on Sep 3 2026 9:36 PM

Asia Cup 2026: Smriti Mandhana Slams Century Breaks World Record

భారత ఓపెనర్‌ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. మహిళల ఆసియా టీ20 కప్‌-2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించింది. 

మిథాలీ రికార్డు బ్రేక్‌
అదే విధంగా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ (10868 పరుగులు)ను స్మృతి అధిగమించింది. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత్‌- హాంకాంగ్‌ (చైనా) జట్లు తలపడుతున్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన హాంకాంగ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. 

ఓపెనర్లలో స్మృతి మంధాన రికార్డు శతకంతో చెలరేగింది. 58 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకుంది ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న స్మృతి 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆఖరి ఓవర్లో రనౌట్‌ అయింది. మరో ఓపెనర్‌ షఫాలి వర్మ (17 బంతుల్లో 28) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్‌ చేరింది.

మిగిలిన వారిలో ప్రతికా రావల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) పూర్తిగా నిరాశపరిచారు. భారతి ఫుల్మలి రెండు, దీప్తి శర్మ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 

అత్యధిక స్కోరు ఆమెదే
స్మృతి గనుక విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉంటే పసికూన చేతిలో స్వల్ప స్కోరుకే పరిమితమవాల్సిన దుస్థితి తలెత్తేది. కాగా మహిళల ఆసియా కప్‌ టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గానూ స్మృతి (124) నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు (119*) పేరిట ఉండేది.

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్లు
👉స్మృతి మంధాన (ఇండియా)- 18
👉మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)- 17
👉లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)- 17
👉హేలీ మాథ్యూస్‌ (వెస్టిండీస్‌)- 15
👉సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌)- 14
👉టామీ బీమౌంట్‌ (ఇంగ్లండ్‌)- 14

తుదిజట్లు
భారత్‌
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతికా రావల్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), భారతి ఫుల్మలి, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమా రావత్‌, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌.

హాంకాంగ్‌, చైనా
నటాషా మైల్స్‌ (కెప్టెన్‌), మరియం బీబీ, మరికో హిల్‌, జోయ్‌లీన్‌ కౌర్‌, మరీనా లాంపో, యాస్మిన్‌ దస్వాని (వికెట్‌ కీపర్‌), షంజీన్‌ షాజాద్‌, క్యారీ చాన్‌, రుచితా వెంకటేశ్‌, ఇక్రా సహర్‌, అలిసోన్‌ సియూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement