source: X
ఏషియన్ గేమ్స్ 2026 కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ షాంటో టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. షాంటో చివరిగా 2025లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక టెస్టు విజయాన్ని అందించిన జట్టుకు షాంటోనే కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఏషియన్ గేమ్స్ కోసం ఎంపిక చేసిన బంగ్లా జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇవాళే సౌతాఫ్రికా-ఏపై ట్రిపుల్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన తౌహిద్ హృదోయ్ దాస్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తాడు. ఈ జట్టులో వికెట్ కీపర్, బ్యాటర్ నురుల్ హసన్‌కు చోటు దక్కలేదు.
అలాగే పేసర్లు తస్కిన్ అహ్మద్, అబ్దుల్ గఫ్ఫార్ సైఫుల్లా కూడా ఈ జట్టులో లేరు. గాయం నుంచి కోలుకుంటున్న నహీద్ రాణా సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్‌తో పేస్ విభాగం బలంగా ఉంది.
ఏషియన్ గేమ్స్‌కు బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), తంజీద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), మొసద్దెక్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరీ, రిషాద్ హొస్సేన్, మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, మహ్మద్ సైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్ముద్.
కాగా, ఏషియన్ గేమ్స్‌లో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్‌ఫైనల్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్ కూడా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: పాక్‌తో చివరి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ కొనసాగింపు


