source: X
మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండోనేషియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు బంతితో అసాధారణ ప్రదర్శన చేసి 5 పరుగులకే ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా చివరి మూడు వికెట్లను వరుస బంతుల్లో తీసి హ్యాట్రిక్ కూడా పూర్తి చేసింది.
తద్వారా మహిళల టీ20ల్లో శ్రీలంక తరఫున తొలి హ్యాట్రిక్‌తో పాటు శ్రీలంక తరఫున మహిళల టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా చూస్తే, మహిళల టీ20ల్లో ఇది ఐదో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (3.3-0-5-1)గా నిలిచింది. ఈ విభాగంలో అత్యుత్తమ రికార్డు బ్రెజిల్ బౌలర్ ఎల్ కార్డోసో (3-2-4-9) పేరిట ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. 125 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండోనేషియా చమారీ బౌలింగ్ దెబ్బకు కేవలం 49 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరో నంబర్ బ్యాటర్ నిలాక్షిక సిల్వ (50) అర్ద సెంచరీతో ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో అతి కష్టం మీద 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.
లంక ఇన్నింగ్స్‌లో నిలాక్షికతో పాటు సంజన కవిండి (15), కావ్యా కవిండి (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇండోనేషియా బౌలర్లలో లూహ్ దేవి (3-32), సంగ్ మయ్‌ప్రియాణి (2-19) సత్తా చాటారు.
అనంతరం స్వల్ప ఛేదనలో చమారీ ధాటికి ఇండోనేషియా విలవిలలాడింది. చమారీతో పాటు కావ్యా (1-14), సుగంధిక (3-1-3-1), కవష (3-0-2-1) వికెట్లు తీయడంతో ఇండోనేషియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున కేవలం ఇద్దరు మాత్రమే 10 పరుగులకు మించి చేశారు.
ఈ టోర్నీలో శ్రీలంక తమ తదుపరి, చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచింది. ఈ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం సాధించింది.


