PC: BCCI X
భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
కాగా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్‌షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్‌షైర్ బ్యాటింగ్‌కు దిగింది.
రంజీల్లో దుమ్ములేపాడు
జమ్మూ కశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు.
కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా
ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్‌లో బౌన్సీ పిచ్‌లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి.
కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్‌షైర్‌తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్‌తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండి: తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌత్ జోన్


