ధోనిని అవమానించలేదు.. ఆరోజు అలా జరిగిందంతే! | Everyone went dressing room, met Dhoni: Ex India Star breaks silence | Sakshi
Sakshi News home page

ధోనిని అవమానించలేదు.. ఆరోజు అలా జరిగిందంతే!

Sep 2 2026 4:29 PM | Updated on Sep 2 2026 4:45 PM

Everyone went dressing room, met Dhoni: Ex India Star breaks silence

ధోని, కర్ణ్‌ శర్మ (PC: IPL/BCCI)

ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ప్రయాణం ఊహకందని విధంగా సాగింది. తొలి ఆరు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి డీలాపడ్డ ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి అద్భుతం చేసింది. ముఖ్యంగా లీగ్‌ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ రాణించింది.

ఉత్కంఠ పోరులో విజయం
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుని.. నాటి డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైని ఎలిమినేట్‌ చేసింది. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత చెన్నై దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనితో కరచాలనం చేసేందుకు ఆర్సీబీ ఆటగాళ్లు ఆలస్యం చేశారని.. లెజెండరీ ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

అవమానించలేదు
రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... ‘‘ఆరోజు అసలు అలాంటిదేమీ జరగలేదు. మేము ఎవరినీ అవమానించలేదు. నిజానికి ఆరోజు మాకు అతిపెద్ద విజయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి.. ఆ తర్వాత తిరిగి ఆరు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌ చేరడం మామూలు విషయం కాదు.

అందుకే మా సంబరాలు ఆకాశాన్నంటాయి. అంతే తప్ప చెన్నై జట్టుతో మాకు ఎలాంటి విభేదాలు రాలేదు. అయితే, మేము ధోనిని కలవలేకపోయాము. మా సెలబ్రేషన్స్‌ అయిపోయిన తర్వాత మా జట్టులోని ప్రతి సభ్యుడు ధోనిని కలిసేందుకు వారి డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లాడు’’ అని కర్ణ్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

ఎవరూ అంతసేపు ఎదురుచూడరు
అయితే, తాము ధోని పట్ల అవమానకరంగా వ్యవహరించామనేలా వీడియోలు బయటకు వచ్చాయని.. వాటిలో నిజం లేదని కర్ణ్‌ శర్మ స్పష్టం చేశాడు. ‘‘ఆరోజు మేము రెండు నిమిషాల సెలబ్రేషన్‌ను 12 నిమిషాలకు పొడిగించాము. అలాంటపుడు మనకోసం ఎవరూ ఎదురుచూడలేరు కదా!.. అందుకే ఆ తర్వాత మేమే వెళ్లి ధోనిని కలిశాము’’ అని పేర్కొన్నాడు.

కాగా 2024 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. ఇక 2025లో ఆర్సీబీ ఎట్టకేలకు తొలిసారిగా ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. అదే జోరు కొనసాగిస్తూ 2026లోనూ చాంపియన్‌గా అవతరించింది. 

ఇదిలా ఉంటే.. చెన్నై, హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున మొత్తంగా నాలుగు టైటిళ్లు గెలిచిన జట్లలో కర్ణ్‌ శర్మ భాగమయ్యాడు. ఈ టీమిండియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  

చదవండి: రవీంద్ర జడేజా అందగాడు, మంచివాడు: ఇంగ్లండ్‌ దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement