రాజస్థాన్ పర్యాటకరంగంలో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. రాజస్థాన్ అనగానే సాధారణంగా జైపూర్ ప్యాలెస్‌లు, ఉదయ్‌పూర్ సరస్సులు, జైసల్మేర్ ఎడారి ప్రాంతాలే గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు పర్యాటకుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు వచ్చింది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో పర్యాటకుల సంఖ్య విషయంలో రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా.. జైపూర్ లాంటి ప్రధాన పర్యాటక కేంద్రాన్ని కూడా అధిగమించింది. గణాంకాల ప్రకారం, 2026 జనవరి నుంచి జూన్ నాటికి సీకర్ జిల్లాను సుమారు 1.5 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు.
ఇదే సమయంలో జైపూర్‌ను సందర్శించిన స్వదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 81 లక్షలుగా నమోదైంది. సీకర్ తర్వాతి స్థానాల్లో చిత్తోడ్‌గఢ్ (సుమారు 1.3 కోట్లు), జైసల్మేర్ (1.1 కోట్లు), అజ్మేర్ (దాదాపు 99 లక్షలు) నిలిచాయి. సంప్రదాయ పర్యాటక నగరాలను దాటి సందర్శకుల ఎంపికలు విస్తరిస్తున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సీకర్‌కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ప్రముఖ ఖాటూ శ్యామ్‌జీ ఆలయమేనని విశ్లేషణలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారు. దీనికితోడు జీణ్ మాతా ఆలయం, శాకంభరి మాతా ఆలయాలు కూడా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ రద్దీ స్థానిక పర్యాటక రంగానికి ఊతమిస్తోంది.
సీకర్ కేవలం ఆధ్యాత్మిక రంగానికే పరిమితం కాలేదు. ఇక్కడి హర్ష పర్వతం ప్రకృతి, చరిత్ర ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ ప్రాంతంలో దాదాపు 1,200 ఏళ్ల నాటి ప్రాచీన శివాలయం, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. హర్ష పర్వతాన్ని ఎకో-టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఖాటూ శ్యామ్‌జీ పరిసరాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీంతో హోటళ్లు, రిసార్టులు, బ్యాంక్వెట్ హాళ్లకు వ్యాపార అవకాశాలు పెరిగాయి. మౌలిక వసతులు, రహదారులు మరింత మెరుగైతే సీకర్ దేశీయ పర్యాటకానికి అతిపెద్ద కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
ఇది కూడా చదవండి: ‘ఒక్క పెయింటింగ్ కొని.. వరద బాధితులను ఆదుకోండి’


