అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్‌ ఫైర్‌ | Inhuman to Book Them: TN CM Vijay Orders Withdrawal of Cases | Sakshi
Sakshi News home page

అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్‌ ఫైర్‌

Sep 2 2026 12:42 PM | Updated on Sep 2 2026 12:52 PM

Inhuman to Book Them: TN CM Vijay Orders Withdrawal of Cases

ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకో.. ప్రభుత్వ ఆస్తులకో నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు.

గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు  పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి.

రైతులపై కేసులెందుకు?
రాష్ట్రానికి.. దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్‌ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్‌కాట్‌ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్‌ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌ సభలోనే ఉండడం గమనార్హం.

డీఎంకే హయాంలో పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. 

టీచర్లపైనా..
ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్‌ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఎన్ని కేసులు?
అయితే డీఎంకే హయాంలో  రైతులు, ఉపాధ్యాయులపై వివిధ ఆందోళనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే పూర్తి సంఖ్యను విజయ్‌ ప్రభుత్వం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. అయితే గతంలో తమిళనాడులో వివిధ ఉద్యమాలకు సంబంధించిన పెండింగ్‌ కేసులపై ప్రభుత్వాలు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే స్పందించాల్సి ఉంది. 

ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాం
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన వారిని అమానవీయంగా వ్యవహరించారని విజయ్‌ ఆరోపించారు. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకే కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే యాంటీ-నీట్‌ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని విజయ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు డీఎంకే హయాంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులను కొట్టేయాలని నిర్ణయించడం గమనార్హం.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ ప్లాన్‌బీ.. వాళ్లకు బంపర్‌ ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement