పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? | KSR Comments On Chandrababu Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?

Sep 2 2026 12:09 PM | Updated on Sep 2 2026 12:33 PM

KSR Comments On Chandrababu Polavaram Project

పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగానే సిద్దం అవుతోందా?వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని ఆ ప్రాజెక్టును  తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా నిర్ధిష్ట లక్ష్యంలో నాలుగో వంతుకే పరిమితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటా అన్నది పెద్ద చర్చగా ఉంది. 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గాను రూపొందించిన ఈ ప్రాజెక్టు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రకారం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు అందించగలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి ఎవరు బాద్యత వహించాలి?. 

ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలని తొలుత భావించగా, ఇప్పుడు దానిని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారన్నది వస్తున్న సమాచారం. దీనికి తొలిదశ అని పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పార్లమెంటుకు ఇస్తున్న సమాచారం పరిశీలిస్తే,ఈ ఎత్తు వరకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ఎల్లో మీడియా మాత్రం దీనిని కవరప్ చేస్తూ ఇది తొలిదశ అయినా, తర్వాత కూడా పనులు సాగించుకోవచ్చని చెబుతోంది. కాని అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-2019 టర్మ్‌లో తీసుకున్న ఒక నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించాలి. కాని చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌ను చంద్రబాబు వదలుకుని పోలవరం కాంట్రాక్టును తీసుకున్నట్లయిందని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించేది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టైమ్‌లో ఈ ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తును కేంద్రంతో ఖరారు చేయించి, తదనుగుణంగా నిధులు మంజూరుకు ఒప్పించారని చెబుతారు. ఇందుకు తగినట్లుగా స్పిల్‌వేని ఆ స్థాయిలో నిర్మాణం చేయించారు. జగన్ ప్రభుత్వం రెండు దశలలో నిర్మాణం జరుగుతుందని చెబితే విపక్షంగా ఉన్న తెలుగుదేశం తీవ్ర విమర్శలు గుప్పించింది. 

రెండేళ్ల క్రితం కూటమి అదికారంలోకి వచ్చాక తొలిదశతోనే ప్రాజెక్టును ముగించే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశమే. 45.72 మీటర్ల ఎత్తున  ప్రాజెక్టు పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల స్థాయిలో అయితే 119 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతారు. ఇదే జరిగితే తొలుత అంచనా వేసినట్లు ఏడు లక్షల ఎకరాలకు పైగా నీటిని అందించడం సాధ్యం కాదు. అలాగే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అలాగే విద్యుత్ ప్రాజెక్టును కూడా వరద వచ్చినప్పుడే నడపగలుగుతారు. 

ఒరిజినల్‌గా పోలవరం నిర్మాణానికి సుమారు 55 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కాని ఇప్పుడు దానిని సుమారు 30వేల కోట్లకే పరిమితం చేస్తున్నారట. ఆ లెక్కన మరో 12 వేల కోట్లు ఇస్తే సరిపోతుందన్నది  కేంద్రం అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఏపీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తుది దశ నిర్మాణాన్ని రాష్ట్రం నిజంగా కొనసాగిస్తే అదనంగా అయ్యే వ్యయం సుమారు 25 వేల కోట్లు ఉంటుంది. కేంద్రం దీనిని ఇస్తామంటే మంచిదే. కాని  రాష్ట్రమే భరించవలసిరావచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని నిర్వాసితుల కోసం ఖర్చు చేయవలసి ఉంది. రెండో దశలో మునిగిపోయే ప్రాంతాన్ని తగ్గించడంవల్ల ఈ వ్యయం తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.

అదే జరిగితే  ప్రాజెక్టు పర్పస్ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన ఉంది. కేంద్రం రెండో దశకు కూడా నిధులు  ఇస్తుందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా అధికారికంగా చెబుతున్నట్లు  కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ భూభాగం మునుగుతుందన్నది ఆ రాష్ట్ర వాదన. నిజానికి ప్రాజెక్టును  వైఎస్సార్‌ ప్రతిపాదించి, వివిధ అనుమతులు సాదించినప్పుడే వాటన్నిటిని లెక్కించి చాలావరకు పరిహారం ఇప్పించారు. తదుపరి ఆయన అనూహ్య  మరణంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఈ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని తెలిపినా, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కేంద్రం నుంచి తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో   ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ పోలవరాన్ని చంద్రబాబు  అవినీతి  ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. 

అంతేకాక కాఫర్ డామ్ పూర్తిగా నిర్మించకుండా రెండు గాఫ్ల్‌ పెట్టి డయాఫ్రం వాల్ నిర్మాణానికి పూనుకోవడం, భారీ వరదల కారణంగా ఆ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలు జరిగాయి. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ ప్రభుత్వంపై నెట్టివేయడం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాఫర్ డామ్ ఎడమవైపు పది అడుగుల వెడల్పు, ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతున జారిందని ఎల్లో మీడియానే రిపోర్టు చేసింది. దీనిని కొంత కవర్ అప్‌  చేసే యత్నం చేస్తూ కధనాన్ని ఇచ్చింది. అదే జగన్ టైమ్ లో ఇలాంటి  ఘటన జరిగి ఉంటే, టీడీపీ, ఎల్లో మీడియా రచ్చ రచ్చగా ప్రచారం చేసేవి. కాగా డయాఫ్రం వాల్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సెంటర్ ఫర్ లిబర్టి ప్రతినిధులు  ఎబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి  చెబుతున్నారు.  వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తి చేసి మమ అనిపించుకుంటారా? లేక పోలవరం ప్రాజెక్టు రెండో దశ కొనసాగించగలుగుతారా అన్న సందేహాన్ని నివృత్తి చేయవలసి ఉంది. 

చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. ఇదే విషయాన్ని  గతంలో  ఆయన చెబుతుండేవారు. టీడీపీ నేతలుగా ఉన్న వడ్డి వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం పోరాడేవారు. అయినా వారిని చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. భారీ ప్రాజెక్టుల వల్ల రాజకీయ లబ్ది వెంటనే ఉండదన్నది ఆయన భావనగా ఉండేది. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం మాత్రమే  కాకుండా సుమారు 48 ప్రాజెక్టులను ఆ రోజుల్లో జలయజ్ఞం పేరుతో సంకల్పించారు. దానిపై టీడీపీ విమర్శలు చేస్తుండేది. విభజన తర్వాత మాత్రం అప్పటికే నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు  చెప్పడం ఆరంభించారు.నిజంగా ఆయన  కలే అయితే చిత్తశుద్దితో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయగలగాలి. చంద్రబాబు ఆ పని చేసి చూపిస్తారా!. లేక దీనితోనే మాయ చేస్తారా? అన్నది చూడాలి. 

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement