గణేశ్‌ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు | Mumbai Ganesh Idols Under 6 Feet Must Be Immersed in Artificial Ponds Directs BMC | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు

Sep 2 2026 9:40 AM | Updated on Sep 2 2026 9:40 AM

Mumbai Ganesh Idols Under 6 Feet Must Be Immersed in Artificial Ponds Directs BMC

ముంబై: రాబోయే గణేశ్‌ ఉత్సవాల్లో ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తప్పనిసరిగా కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. కోర్టు తీర్పు మేరకు ఆదేశించింది. సెప్టెంబర్ 14 నుంచి పది రోజుల పాటు గణేశ్‌ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారులు, గణేశ్‌ మండపాల ప్రతినిధులు, విగ్రహ తయారీదారుల సమీక్షా సమావేశం అనంతరం బీఎంసీ ఈ వివరాలను వెల్లడించింది.

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తుది తీర్పు వచ్చే వరకు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ముంబై వ్యాప్తంగా 281 కృత్రిమ చెరువులు, 44 బీచ్‌లు/జెట్టీలు, 23 సహజ సరస్సులతో కలిపి మొత్తం 348 నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేశారు. కృత్రిమ చెరువుల వివరాలను క్యూఆర్ కోడ్‌లు, గూగుల్ మ్యాప్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం 1,132 మంది లైఫ్‌గార్డులు, 85 అంబులెన్స్‌లు, 34 క్రేన్లు, 10 మోటార్ బోట్లను రంగంలోకి దించుతున్నారు. వీటితో పాటు 498 చెత్త సేకరణ డబ్బాలు, 326 డంపర్లు, 6,052 ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.

విగ్రహాల రవాణా మార్గాల్లోని 506 రహదారులపై ఉన్న 4,279 గుంతలను, 171 డ్రైనేజీ మూతలను బీఎంసీ మరమ్మతు చేసింది. 281 చోట్ల అడ్డంకిగా ఉన్న కేబుళ్లను తొలగించి, 515 ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించింది. పర్యావరణహిత వేడుకల కోసం తయారీదారులకు 858 టన్నుల మట్టి, 25,400 లీటర్ల ఎకో-ఫ్రెండ్లీ రంగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,136 మంది విగ్రహ తయారీదారులకు అనుమతులు మంజూరయ్యాయి.

ఉత్సవాల సందర్భంగా ‘శ్రీ గణేశ ఆరోగ్యచ’ పేరిట మండళ్ల వద్ద ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ముంబై మేయర్ రీతు తావ్డే తెలిపారు. వీటిలో సాధారణ ఆరోగ్య, నేత్ర పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడతారు. భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని, రద్దీ ఉండే ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ‘డాడీ గుర్తొస్తున్నావ్‌..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement