ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి | Heavy Rains Wreak Havoc: 7 Dead in Uttarakhand, Flood Alert in UP and Jharkhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి

Sep 2 2026 8:19 AM | Updated on Sep 2 2026 8:19 AM

Heavy Rains Wreak Havoc: 7 Dead in Uttarakhand, Flood Alert in UP and Jharkhand

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. కొండచరియల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 172కు పైగా రహదారులు మూతపడ్డాయి. ఇందులో పితోరాగఢ్, నైనితాల్, బాగేశ్వర్‌లను కలిపే జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. బాగేశ్వర్‌లో ఎన్‌హెచ్-109 సహా 16 మార్గాలు స్తంభించడంతో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గౌలా, కోసి, క్షిప్రా, బిన్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

హల్ద్వానీ సమీపంలోని గౌలా నది నుంచి సుమారు 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పౌడీ జిల్లా కోట్‌ద్వార్‌ సమీపంలో కొల్హు నదిని దాటుతూ తల్లి, ఏడాదిన్నర చిన్నారి కొట్టుకుపోయి మరణించారు. అల్మోరా జిల్లా ఉదయ్‌ఉడా గ్రామంలో ఇళ్లపైకి శిథిలాలు విరుచుకుపడటంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందగా, ధార్ ప్రాంతంలో మరో ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల తీవ్రత దృష్ట్యా నైనితాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, పితోరాగఢ్ జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా సోన్‌ప్రయాగ్ వద్ద కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా, మందాకిని నదుల ఉధృతితో వరద ముప్పు తీవ్రమైంది. సీతాపూర్‌లో గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, ఘాజీపూర్‌లో ఇద్దరు బాలికలు గంగలో కొట్టుకుపోయారు. బలియాలో గంగానది ప్రమాద స్థాయికి 1.60 మీటర్ల ఎగువన ప్రవహిస్తుండటంతో 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారణాసిలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లు మునిగిపోవడంతో అంత్యక్రియలను సమీప భవనాల డాబాలు, వీధుల్లో నిర్వహిస్తున్నారు. చిత్రకూట్‌లో మందాకిని నది ప్రమాద స్థాయిని దాటి 4 మీటర్ల మేర ప్రవహిస్తోంది. అటు ఝార్ఖండ్‌లోని గర్హ్వా, పలాము, సిమ్‌డేగా సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్) హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement