నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు? | Major Accident in Hathnikund Barrage Army Boat Capsizes During Exercise in Yamuna River | Sakshi
Sakshi News home page

నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?

Sep 2 2026 11:08 AM | Updated on Sep 2 2026 11:15 AM

Major Accident in Hathnikund Barrage Army Boat Capsizes During Exercise in Yamuna River

యమునానగర్‌: హర్యానా-హిమాచల్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన మాక్ డ్రిల్ సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల విన్యాసాల్లో (ఫ్లడ్ రెస్క్యూ ఎక్సర్‌సైజ్) పాల్గొన్న ఆర్మీకి చెందిన మోటారు బోటు యమునా నది ఉధృతికి బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు గల్లంతయినట్లు తెలుస్తోంది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన ‘వన్ పారా స్పెషల్ ఫోర్స్’ బలగాలు హత్నీకుండ్ బ్యారేజీ పరిసరాల్లో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సైనికులు ప్రయాణిస్తున్న మోటారు బోటు ప్రమాదవశాత్తూ యమునా నదిలోని ప్రమాదకర ప్రాంతం (డేంజర్ జోన్) వైపు వెళ్లింది. నదిలో నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో బోటు ఒక్కసారిగా తిరగబడి మునిగిపోయింది. దీంతో అందులోని జవాన్లు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు సైనికులు దాదాపు 600 మీటర్ల మేర ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు.

సమాచారం అందుకున్న వెంటనే సైనిక దళాలతో పాటు హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు మోటారు బోటును నదిలో నుంచి వెలికితీశారు. అయితే గల్లంతైన జవాన్ల ఆచూకీ ఇంకా లభించలేదు. నదిలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ప్రమాదానికి గల  కారణాలు, అందులో చిక్కుకున్న సైనికుల సంఖ్యపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ప్రతాప్‌నగర్ పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘ఒక్క పెయింటింగ్‌ కొని.. వరద బాధితులను ఆదుకోండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement