బాయ్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే కోసం రిసార్ట్‌ బుక్‌ చేసిన యువతి | Drunk Man Attacks Watchman in Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాయ్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే కోసం రిసార్ట్‌ బుక్‌ చేసిన యువతి

Sep 2 2026 11:33 AM | Updated on Sep 2 2026 12:18 PM

 Drunk Man Attacks Watchman in Visakhapatnam

విశాఖపట్నం: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, మద్యం మత్తులో యువకులు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. పుట్టినరోజు పేరిట పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం(ఎస్‌ఆర్‌ పురం)లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఓ పార్టీలో 15 మంది యువతీ యువకులు గంజాయి, మద్యం సేవించారు. ఈ క్రమంలో జరిగిన గొడవను ప్రశ్నించిన రిసార్ట్‌ వాచ్‌మన్‌ను బీరు, మద్యం బాటిళ్లతో విచక్షరహితంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దాడిలో గాయపడిన వాచ్‌మన్‌ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. 

నగరంలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రోషిణి అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ కనకల గణేష్‌(24) పుట్టినరోజు కోసం ఎస్‌ఆర్‌ పురంలోని లక్కీ రిసార్ట్‌ను బుక్‌ చేసింది. వారిద్దరితో సహా మొత్తం 15 మంది(11 మంది యువకులు, నలుగురు యువతులు) సోమవారం రాత్రి రిసార్ట్‌కు చేరుకున్నారు. మంగళవారం వేకువజాము వరకు గంజాయి, మద్యం పూటుగా సేవించారు. ఆ తర్వాత అదుపుతప్పి రిసార్ట్‌లోని సామగ్రిని బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. అదే సమయంలో వారితో వచ్చిన యువతులపై కూడా యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రిసార్ట్‌ వాచ్‌మన్‌గా ఉన్న బమ్మిడి పైడయ్య(70) మద్యం మత్తులో ఉన్న వారందరినీ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తి మత్తులో ఉన్న 15 మందీ మూకుమ్మడిగా పైడయ్యపై బీరు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. దీంతో పైడయ్య కుప్పకూలిపోయాడు. 

రక్తపు మడుగులోనే 5 గంటలు.. 
పైడయ్యపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులు ఒక్కొక్కరిగా రిసార్ట్‌ నుంచి జారుకున్నారు. పుట్టినరోజు చేసుకున్న గణేష్‌ మాత్రం మత్తులో రూమ్‌లోనే ఉన్నాడు. ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లో పనిచేసే హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది వచ్చి చూడగా పైడయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న పైడయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రూమ్‌లో మత్తులో పడి ఉన్న నిందితుడు గణేష్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కేవీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఇటీవలే ఆనందపురం పరిధిలో ఓ రిసార్ట్‌లో ఇదే తరహా దాడి జరగడం గమనార్హం. గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరకడంతో పాటు కూటమి నాయకుల అండదండలతోనే ఇలా అసాంఘిక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement