అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత | Anna Hazare Hospitalised Health Bulletin Updates | Sakshi
Sakshi News home page

అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత

Sep 1 2026 7:13 AM | Updated on Sep 1 2026 7:22 AM

Anna Hazare Hospitalised Health Bulletin Updates

ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల కావాల్సి ఉంది.

అహింసా పద్ధతుల్లో.. శాంతియుత మార్గాల్లో అన్నా హజారే గతంలో పలు సత్యాగ్రహాలు చేశారు.  ఇప్పటిదాకా ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌ (ఐఏసీ) మాత్రం ఆయనకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత రైతు చట్టాలు సహా అనేక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలి నీట్‌ నిరసనలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా జూలై 23న రెండు గంటలపాటు మౌన దీక్ష కూడా చేపట్టారు.

89 ఏళ్ల హజారే.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీ సంబంధిత సమస్యలతో.. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. రాలేగావ్‌ సిద్ధిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. బాంబే ఆస్పత్రిలో  వైద్యుడు గౌతమ్‌ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.

కేజ్రీవాల్‌తో కలిసి..
2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్‌ 5న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జనలోక్‌పాల్‌ బిల్లును బలంగా తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ప్రభుత్వం జనలోక్‌పాల్‌ బిల్లుపై చర్చలకు దిగింది. 

ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌ బేడీ, ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు హజారేకు కీలక సహచరులుగా ఉన్నారు. హజారే ఉద్యమానికి కేజ్రీవాల్‌ బలమైన మద్దతు ఇవ్వడంతో ఇద్దరి పేర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. అనంతరం అదే ఉద్యమం నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు.

ఇదీ చదవండి: బీజేపీ సర్కార్‌కు ఆరేళ్ల పిల్లాడి వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement