పేదోడి బిడ్డను కలవడం ఇష్టం లేదని చెప్పండి మోదీగారు!
ఆందోళనలో పాల్గొంటే అమ్మానాన్నలను కొడతారా?
మరోసారి చెలరేగిన చిచ్చరపిడుగు
బిహార్ చిచ్చరపిడుగు ఆదిత్యకుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షార్థుల ఆందోళనలో భాగమై నెట్‌లో వైరల్ అయిన ఈ ఆరేళ్ల కుర్రాడు తల్లిదండ్రులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నా కొనసాగిస్తున్నాడు. బైఠాయింపు మొదలైంది ఆదివారమైనప్పటికీ సోమవారం ఆదిత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ‘పిట్ట కొంచెం.. కూతఘనం’’అన్న సామెతను గుర్తు చేశాయి.
‘‘కొండను తవ్వి రహదారిని నిర్మించిన దశరథ్‌రామ్ మాంఝీ మాదిరిగా ఈ ప్రభుత్వపు గర్వం అణచివేస్తా’’అని ఆదిత్యకుమార్ ప్రకటించాడు. ఆగస్టు 25న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షార్థులు తమ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని ఇంటివద్దే ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఆదిత్యకుమార్ కూడా పాల్గొన్నాడు. ఇతడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించి ‘‘వీడితో జాగ్రత్త’’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో పోలీసులు తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కొట్టారని ఆదిత్యకుమార్ ఆరోపిస్తున్నాడు. పోలీసులు మాత్రం కుర్రాడిని తల్లికి అప్పగించామని, అతడి భద్రతను దృష్టిలో ఉంచుకునే పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టామని చెబుతున్నారు. కానీ పోలీసుల వ్యాఖ్యలను ఆదిత్య అస్సలు నమ్మడం లేదు.. ‘‘తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఈ డిమాండ్ తీరే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదు’’అని భీషి్మంచుకున్నాడు.
‘‘నా మాదిరే పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న తల్లిదండ్రులకూ భరోసా ఇస్తున్నా. దశరథ్‌రామ్ మాంఝీ ఎలాగైతే కొండను తవ్వి రోడ్డు నిర్మించాడో నేను కూడా ఈ ప్రభుత్వపు గర్వాన్ని అణచివేస్తా’’అని మీడియా ప్రతినిధుల ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఒక చేతిలో రాజ్యాంగ ప్రతితో ఆదిత్య మాట్లాడుతూ... ‘‘విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్నారన్న కారణంగా ఎవరి తల్లిదండ్రులనైనా కొట్టవచ్చునని ఇందులో ఎక్కడ రాసుందో ఎవరైనా చూపించగలరా?’’అని ప్రశ్నించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవాలని, లేదంటే బీద పిల్లాడిని కలవడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో పోస్టు అయినా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ బుడతడు. ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల కోసం రోడ్ షోలూ చేస్తారు. అలాంటప్పుడు ఒక పిల్లాడిని ఎందుకు కలవకూడదు? అని నిలదీశాడు. తన తల్లిదండ్రులను కొట్టిన విషయంలో జోక్యం చేసుకోవాలని ఆదిత్యకుమార్ ఆదివారం కూడా ప్రధాని నరేంద్రమోదీని అభ్యరి్థంచాడు. దీనికి ఒక రోజు ముందే పోలీసుల దౌర్జన్యంపై న్యాయవిచారణ కోరుతూ బీహార్ డీజీపీకి వినతి పత్రం సమరి్పంచానని ఆదిత్య చెప్పడం కొసమెరుపు!
–పట్నా


