ఏపీ సిట్ తీరు ఆందోళనకరం.. సిట్ అతి చేస్తోంది
రెండేళ్లలో కనుగొన్నదేమీ లేదు.. తొలుత దాని సంగతి తేలుస్తాం
మద్యం రవాణా అక్రమ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోయే అవకాశమే లేదు
అలాంటప్పుడు ప్రొడక్షన్ వారెంట్ ఎలా అడుగుతారు?
ఇది హైకోర్టును మీరి వ్యవహరించడం కాదా?
హైకోర్టు తీర్పును అనుసరించాల్సిందే
లేదంటే ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని స్పష్టికరణ.. ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలి
కౌంటర్ దాఖలు చేయాలని కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిలకు నోటీసులు
తదుపరి విచారణ సెప్టెంబర్ 15కు వాయిదా
సాక్షి, అమరావతి: మద్యం రవాణా అక్రమ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా ఏం చేసిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమీ కనుగొనలేకపోయిందని తేల్చి చెప్పింది. ఈ కేసులో సిట్ అనుసరిస్తున్న పక్షపాత, చట్ట విరుద్ధ తీరును తప్పు పట్టింది. సిట్ తీరు ఆందోళన కలిగిస్తోందని, అతి చేస్తోందని తెలిపింది. ఈ కేసులో తాము ముందు సిట్ తీరు తేలుస్తామని, ప్రవర్తనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాతే హైకోర్టు ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది.
ఈ కేసులో నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, కింది కోర్టులో సిట్ ప్రొడక్షన్ వారెంట్ కోరడాన్ని తప్పుబట్టింది. ‘అతను అప్పటికే కస్టడీలో ఉన్నాడు. పారిపోయే అవకాశం ఏ మాత్రం లేదు. అలాంటప్పుడు మీరు ప్రొడక్షన్ వారెంట్ కోసం ఎలా దరఖాస్తు చేస్తారు? ఇది హైకోర్టును మీరి వ్యవహరించడం కాదా? ఇది అతి చేయడం కాదా?’ అని సిట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కడిగి పారేసింది. దర్యాప్తు సంస్థల ఏకపక్ష వైఖరిని రాజ్యాంగంలోని అధికరణ 136 కింద ఎలా అనుమతించగలమని నిలదీసింది. సిట్ తీరు కచ్చితంగా ఆక్షేపణీయమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్
హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిట్ తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా, ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
కేసిరెడ్డి పోలీసు కస్టడీపై మీరు (సిట్) నిజంగా సీరియస్‌గా ఉన్నారా? ఒకవైపు కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలని కోరుతారు. తీరా జడ్జి ప్రొడక్షన్ వారెంట్ ఇచ్చాక పోలీసు కస్టడీకి సిద్ధంగా లేమని చెబుతారా? ఇదేం తీరు? పోలీసు కస్టడీకి ప్రిపేర్ కాకుండా తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని అడగడం ఏ రకమైన ప్రవర్తన? ప్రొడక్షన్ వారెంట్ అనేది అరెస్ట్ వారెంట్‌తో సమానం. రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఏమీ కనుగొనలేకపోయారు’ అంటూ సిట్ తీరును ధర్మాసనం తీవ్రస్థాయిలో ఎండగట్టింది.
కస్టోడియల్ విచారణ అవసరం..
న్యాయవాది ఆదినారాయణరావు ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ.. మద్యం రవాణా కేసు భారీ వ్యవహారమని, నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన
అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ వస్తోందని, ప్రొడక్షన్ వారెంట్‌ను నిరోధిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
ఒక దాని వెంట ఒకటి కేసుల నమోదు
దీనిపై కేసిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది పటా్వలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశ పూర్వకంగానే ఒకదాని తర్వాత ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2024 నాటి మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న దశలో, ఉద్దేశ పూర్వకంగానే సిట్ ఈ ఏడాది మరో కేసు (మద్యం రవాణా) నమోదు చేసిందన్నారు. తద్వారా కేసిరెడ్డిని కస్టడీలో ఉంచేలా సిట్ కక్షపూరిత తీరుతో వ్యవహరించిందన్నారు. అందుకే హైకోర్టు కేసిరెడ్డి అక్రమ అరెస్ట్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించిన హైకోర్టు
మద్యం రవాణా అక్రమ కేసులో తమ అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సిట్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించి, వారి తక్షణ విడుదలకు ఆదేశాలిచ్చారు.
మద్యం రవాణా కేసులో చాలా కాలంగా అరెస్టు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, 2026 ఏప్రిల్ 7న ఈ కేసులో బెయిల్ లభించిన తర్వాతే రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. కేసిరెడ్డిని ముందుగా కస్టడీలోకి తీసుకుని, తర్వాత కోర్టులో అరెస్ట్ చూపారంది. అంతేకాక అరెస్ట్‌కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఇది బీఎస్‌ఎస్‌ఎస్ సెక్షన్ 53కు విరుద్ధమని తేల్చి చెప్పింది.
హైకోర్టు తీర్పును అనుసరించాల్సిందే
న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సిట్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. లేని పక్షంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని హెచ్చరించింది. తాము హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేంత వరకు.. అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.


