Representative image
ఢిల్లీ ఔటర్-నార్త్‌లోని బవానా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల నర్సరీ బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు సోమవారం తెలిపారు. పాఠశాల బస్సు నడిపే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో గాయాలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆగస్టు 19న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి అడిగినప్పుడు.. తనకు చాక్లెట్లు ఇస్తున్న ఒక అంకుల్ గురించి తల్లికి ఆ పాప చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చాక్లెట్స్ ఇస్తున్న ఓ బ్యాడ్ అంకుల్ ఇదంతా చేశారని ఆ పాప చెప్పిందన్నారు. ఆగస్టు 24న బాలికకు పాఠశాలలోని వ్యక్తుల ఫొటోలు, సీసీటీవీ దృశ్యాలు చూపించగా, ఆమె నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
నిందితుడిపై బవానా పోలీస్ స్టేషన్‌లో బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో)లోని సెక్షన్లు 8, 10, 21, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. మహిళపై ఆమె గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి సంబంధించిన సెక్షన్ 74 కింద కూడా కేసు నమోదు చేసి, పాఠశాల నుంచే నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఆగస్టు 24న బవానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ పాఠశాల ఢిల్లీ ఔటర్-నార్త్‌లోని పూత్ ఖుర్ద్‌లో ఉంది. నిందితుడు సుమారు 8 నెలలుగా పాఠశాల బస్సు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికను బాత్‌రూమ్ వరకు వెంబడించి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో బాలికపై 4 సార్లు లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోందని అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ తన ఫోన్‌లో పిల్లలకు చాక్లెట్లు ఇస్తున్న వీడియోలను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
“పాఠశాల ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిస్తున్నాం” అని అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.


