PC: BCCI/X
శ్రీలంక పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి.. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఇందుకు వేదిక.
కాగా అఫ్గాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ లేదంటే భారత్‌లో అఫ్గాన్ బోర్డు తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో టీమిండియా- అఫ్గాన్ టీ20 మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది.
తెరమీదకు ఊహించని పేరు
ఈ క్రమంలో భారత జట్టు ఎంపిక గురించి చర్చ జరుగుతుండగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ఒకరు అనూహ్యంగా కృనాల్ పాండ్యా పేరును తెరమీదకు తెచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానాన్ని సెలక్టర్లు కృనాల్‌తో భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. కాగా టీమిండియా ఇటీవల యూకే పర్యటనలో భాగంగా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే.
తొలిసారి టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసి పరువు నిలబెట్టుకుంది.
అయితే, యూకే టూర్‌లో అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో కొత్త లెఫ్టార్మ్ స్పిన్నర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్ల చూపు కృనాల్ పాండ్యాపై పడినట్లు సదరు రిపోర్టర్ పేర్కొన్నారు.

భువనేశ్వర్ కుమార్‌తో కృనాల్ పాండ్యా (PC: RCB/BCCI)
ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ?
2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కృనాల్ పాండ్యా 2021లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ పాండ్యా.. 130, 124 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో రెండు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర
35 ఏళ్ల కృనాల్ పాండ్యా ఐపీఎల్ 2025,2026 సీజన్లలో అద్భత ప్రదర్శన కనబరిచాడు. గతేడాది 109 పరుగులు చేయడంతో పాటు పదిహేడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడాది తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 226 పరుగులు సాధించిన కృనాల్.. 15 ఇన్నింగ్స్‌లో కలిపి 14 వికెట్లు కూల్చాడు.
తద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కృనాల్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓ మోస్తరుగా రాణించాడు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిపి 173 పరుగులు చేసిన అక్షర్.. 13 ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు తీశాడు. అయితే, యూకే పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు వికెట్లు తీసి.. 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం


