అదంతా నాటకం: పాక్‌ ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌ | All For Show: England Great Slams Imam ul Haq Injury Drama 2nd Test | Sakshi
Sakshi News home page

అదంతా నాటకం: పాక్‌ ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌

Aug 31 2026 11:33 AM | Updated on Aug 31 2026 11:48 AM

All For Show: England Great Slams Imam ul Haq Injury Drama 2nd Test

PC: X

పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ తీరుపై ఇంగ్లండ్‌ దిగ్గజ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజంగా గాయపడి ఉంటే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది.

మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే
ఇందులో భాగంగా.. ఆతిథ్య జట్టు చేతిలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్‌.. రెండో టెస్టులోనూ 194 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోగా.. పాక్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

నొప్పితో విలవిల్లాడుతూ
ఇదిలా ఉంటే.. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. మిగిలిన నాలుగు రోజుల ఆటకు అతడు దూరం కావడంతో.. పాక్‌ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ కొనసాగించింది.

నాటకం ఆడాడు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ వసీం ఇమామ్‌ తన గాయాన్ని ఎక్కువచేసి చూపించాడని.. బ్యాటింగ్‌ తప్పించుకునేందుకే ఇలా నాటకం ఆడాడని నిందించాడు. మరోవైపు.. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇమామ్‌ ఉల్‌ హక్‌ మోకాలికి పెద్ద బ్యాండేజ్‌ కట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు కనిపించాడు. అవసరమైతే ఆఖరి రోజు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నానట్లు సంకేతాలు ఇచ్చాడు.

బిల్డప్‌ మాత్రమే
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కాగా ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఇమామ్‌ ఉల్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అదంతా షో ఆఫ్‌. కేవలం నాటకం మాత్రమే. తన సహచర ఆటగాళ్లు, మీడియా ముందు తానేదో కష్టపడుతున్నానని చూపే ప్రయత్నం.

ఇలాంటివి లోపల చేయొచ్చు. కానీ అందరిముందు ఇలా చేయడం బిల్డప్‌ మాత్రమే. షార్ట్స్‌ వేసుకుని మోకాలికి టేప్‌ చుట్టుకుని చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. నాకైతే ఇది ఎంతమాత్రం నచ్చలేదు. సారీ’’ అంటూ స్టువర్ట్‌ బ్రాడ్‌ మండిపడ్డాడు. కాగా రెండో టెస్టులో ఇమామ్‌ బ్యాటింగ్‌కే రాలేదు. 

మరోవైపు.. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడిన ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అలీ.. ‘నాకు ఇమామ్‌ పరిస్థితి గురించి తెలుసు. కానీ నేనేమీ మాట్లాడకూడదు. వైద్య బృందమే మీకు సరిగ్గా వివరించగలదు’ అని చెప్పాడు. దీనిని బట్టి స్టువర్ట్‌ బ్రాడ్‌ అన్న మాటలు నిజమేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ వీరవిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement