ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు శక్తులు.. వారి భేటీపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానుండటంతో.. సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్‌పింగ్ భేటీపై అందరి చూపూ నిలిచింది.
బిష్కెక్ వేదికగా సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఎస్‌సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారంపై నేతలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బిష్కెక్‌కు చేరుకున్న మోదీ
ఉజ్బెకిస్థాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆదివారం బిష్కెక్ చేరుకున్నారు. కిర్గిజిస్థాన్ క్యాబినెట్ మంత్రుల మండలి చైర్మన్ అడిల్‌బెక్ కసిమలియేవ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో మోదీకి ఘన స్వాగతం లభించింది.
కీలక నేతలతో ద్వైపాక్షిక భేటీలు
ఈ సదస్సు సందర్భంగా మోదీ కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు జపరోవ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇతర ఎస్‌సీవో దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్.. జిన్‌పింగ్, పెజెష్కియాన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.


