ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం | PM Modi Honoured with Uzbekistan Highest Award During Tashkent Visit, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Aug 30 2026 3:17 PM | Updated on Aug 30 2026 5:17 PM

Uzbekistan highest award for Prime Minister Modi

తాష్కెంట్‌: ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఉజ్బెకిస్తాన్‌ దేశ అత్యున్నత పురస్కారమైన " ఆర్డర్‌ ఆఫ్‌ ఒలియ్‌ ‍దురజాలీ దోస్త్లిక్‌"  ను మోదీకి ప్రధానం చేశారు. దేశ అధ్యక్షుడు మిర్జియో స్వయంగా ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని భారత్‌- ఉజ్బెకిస్తాన్‌ శాశ్వత బంధానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌ చేరుకున్నారు. తాష్కెంట్‌లో ‘యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్’ నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజలను యోగాతో అనుసంధానం చేసినందుకు అక్కడి అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. యోగా ద్వారా ఇరు దేశాల సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని, ప్రజల మధ్య స్నేహం మరింత బలపడుతుందని అన్నారు.

అంతకుముందు తాష్కెంట్‌ విమానాశ్రయంలో ప్రధానికి ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్‌కత్‌ మిర్జియోయెవ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్ష భవనంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యారంగాల్లో సహకారాన్ని ఇరు దేశాధినేతలు సమీక్షించనున్నారు. ‘వికసిత్ భారత్ 2047’, ‘ఉజ్బెకిస్థాన్-2030’ అభివృద్ధి లక్ష్యాలపై సమాలోచనలు జరుపుతారు. అలాగే తాష్కెంట్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని సైతం   ప్రధాని సందర్శించనున్నారు.

మోదీ రాక సందర్భంగా తాష్కెంట్‌లోని ప్రముఖ హోటల్ హిల్టన్‌తో పాటు చారిత్రక కట్టడాలను భారత త్రివర్ణ పతాక కాంతులతో ముస్తాబు చేశారు. అక్కడి 16 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, ప్రవాసులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిజ్ రిపబ్లిక్‌లోని బిష్కెక్‌కు వెళ్లి 26వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement