మహిళా బిల్లును ఆపడం ఎవరితరం కాదు! | PM Narendra Modi Speaks on the Womens Reservation Bill | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లును ఆపడం ఎవరితరం కాదు!

Nov 29 2026 1:31 AM | Updated on Nov 29 2026 1:32 AM

PM Narendra Modi Speaks on the Womens Reservation Bill

బిల్లుకు ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగిస్తాం.. 

మేం నారీశక్తికి ఇచ్చిన హామీని నెరవేరుస్తాం 

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం..

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రధాని మోదీ వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకొస్తున్న ప్రతిష్టాత్మక బిల్లును అమ లుకాకుండా ఆపడం ఎవరితరం కాదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును సోమవారం లోక్‌ సభలో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వేళ మోదీ శనివారం ‘ఎక్స్‌’లో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల విషయంలో మా ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదు రయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తాం. 

మేం నారీ శక్తికి గతంలోనే వాగ్దానం చేశాం. ఆ మాటకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం’’అని ఆయన చెప్పారు. లోక్‌సభ స్థానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 50% పెంచడంతో పాటు, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం పార్లమెంట్‌లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనలతో రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలపడం తెల్సిందే. 

‘‘మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ పోరాటంలో నేనూ భాగస్వామినే. మహిళలు పలుమార్లు నన్ను కలిసి రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. అనేకమంది సోదరీమణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలోని మహిళలందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం మా ప్రభుత్వానికి ఉంది’’అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

అడ్డుకోవాలని చూస్తే అది సాధ్యం కాదు.. 
‘‘మహిళా రిజర్వేషన్ల విషయంలో మా ప్రభుత్వ ధైర్యం, సంకల్పం చెక్కుచెదరవు. మా ఆత్మవిశ్వాసం బలంగా ఉంది. మా ధైర్యం చెక్కుచెదరనిది. మా సంకల్పం దృఢమైనది. మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఈ ప్రయత్నాన్ని రాజకీయ కారణాలతో అడ్డుకోవాలని చూసే పార్టీలకు ఓటమి తప్పదు. పార్లమెంట్, శాసనసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం ఖాయం’’అని మోదీ అన్నారు.  

అన్ని పార్టీలు మద్దతివ్వాలన్న అమిత్‌ షా 
మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు ప్రజాప్రతినిధుల సంఖ్య పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోద ముద్రవేసింది. నారీశక్తి వందన్‌ చట్టం ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యం సాకారం కానుంది’’అని షా శనివారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘మహిళలకు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కల్పించడం మోదీ ప్రభుత్వ సంకల్పం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే విధానాల రూపకల్పన, చట్టాల తయారీ, జాతీయ ప్రాధాన్యతల నిర్ణయంలో వారి పాత్ర మరింత విస్తృతమవుతుంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగడంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా పథకాల రూపకల్పన సాధ్యమవుతుంది. ఈ చారిత్రక ప్రతిపాదనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి’’అని పిలుపునిచ్చారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచడంతోపాటు, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే గొప్ప ముందడుగు అని షా పేర్కొన్నారు. 

రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 170(1)ను సవరించి రాష్ట్ర శాసనసభల్లో గరిష్ట స్థానాల పరిమితిని 500 నుంచి 650కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉందని వివరించారు. ఈ నిబంధన ద్వారా ఉత్తరప్రదేశ్‌ను విభజించకుండానే ఆ రాష్ట్ర శాసనసభలో ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లో సుపరిపాలన, ప్రజా భాగస్వామ్యం రెండింటినీ మరింత బలోపేతం చేయనున్నందున ఈ చారిత్రక బిల్లును ఉత్తరప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement