అసెంబ్లీల్లోనూ సీట్లు 50 శాతం పెంపు  | Bill proposes a 50 per cent increase in Lok Sabha and Assembly seats | Sakshi
Sakshi News home page

అసెంబ్లీల్లోనూ సీట్లు 50 శాతం పెంపు 

Nov 28 2026 6:45 AM | Updated on Nov 28 2026 6:45 AM

Bill proposes a 50 per cent increase in Lok Sabha and Assembly seats

శాసనసభల్లో గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి 500 నుండి 650కి పెంపు 

మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమలు  

చట్టం ద్వారా పొడిగించే అధికారం పార్లమెంట్‌కు లభ్యం  

న్యూఢిల్లీ:  ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి లోక్‌సభలో సీట్ల కేటాయింపును, వాటి శాసనసభల బలాన్ని 50 శాతం మేర పెంచి, మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ కల్పించేందుకు, అలాగే ఈ సవరించిన సీట్ల కేటాయింపులను, వాటి సరిహద్దులను 2051 వరకు స్థిరంగా ఉంచేందుకు కేంద్రం లోక్‌సభలో నూతన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు–2026 ప్రకారం.. లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించారు. 

ఇందులో రాష్ట్రాల నుండి గరిష్టంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 మంది సభ్యులు ఉంటారు. అలాగే, రాష్ట్ర శాసనసభల్లో గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితిని కూడా 500 నుండి 650కి పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా లోక్‌సభలోనూ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోనూ మహిళలకు(ఎస్సీ, ఎస్టీ మహిళలు సహా) మూడింట ఒక వంతు రిజర్వేషన్లను త్వరగా అమల్లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని బిల్లుకు సంబంధించిన ‘ఉద్దేశాలు, కారణాల ప్రకటన’పేర్కొంది. 

ఈ ప్రక్రియ ద్వారా.. నియోజకవర్గాల పునర్విభజనకు(డీలిమిటేషన్‌కు) ముందు ఉన్న స్థానాల సంఖ్యతో పోలిస్తే, లోక్‌సభలోనూ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లుతో పోలిస్తే.. రాష్ట్రాల వారీగా సీట్లను ఏకరీతిగా పెంచుతామన్న హామీయే ఇందులోని ప్రధాన మార్పు. ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను ఏకరీతిగా పెంచడం వల్ల లోక్‌సభలో ఆ రాష్ట్రం సీట్ల వాటాను యథాతథంగా కాపాడుకోవచ్చు. 

ముగ్గురు సభ్యులతో డీలిమిటేషన్‌ కమిషన్‌  
ఈ కొత్త బిల్లు, ప్రతిపాదిత సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న ‘తాజాగా ప్రచురించిన జనాభా గణన గణాంకాలను’ఉపయోగించి నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీయడానికి అనుమతిస్తుంది. అంటే ప్రాథమికంగా 2011 జనాభా గణన సంఖ్యలు అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తిరిగి సర్దుబాటు చేసిన స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వివిభజన అనేది 2051 వరకు కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ల బిషయంలో 2023 సవరణ అమలులోకి వచ్చినప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ఈ కోటా కొనసాగుతుంది. దీనిని చట్టం ద్వారా పొడిగించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. 

మహిళల కోసం కేటాయించిన స్థానాలను ఏ పద్ధతిలో, ఏ ప్రాధికారిక వ్యవస్థ ద్వారా రొటేషన్‌ (మార్పిడి) చేయాలో పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. అనుబంధ డీలిమిటేషన్‌(రెండో) బిల్లు–2026 ప్రకారం కేంద్రం నియమించిన, ప్రస్తుతం పనిచేస్తున్న లేదా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. సీట్ల కేటాయింపులను నిర్ధారించడం, నియోజకవర్గాలను పునర్విభజించడం. మహిళల కోసం రిజర్వ్‌ చేయాల్సిన సీట్లను గుర్తించడం ఈ కమిషన్‌ బాధ్యతలు. బిల్లులోని 8వ నిబంధన ప్రకారం... రిజర్వ్‌డ్‌ సీట్లను రొటేషన్‌ పద్ధతిలో కేటాయిస్తారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి వర్గాలకు రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాల్లోనే సీట్లను రొటేషన్‌ పద్ధతిలో కేటాయిస్తారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement