నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
175 నుంచి 263కు ఏపీ అసెంబ్లీ స్థానాలు
25 నుంచి 37 లేదా 38కి లోక్‌సభ సీట్లు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. పెరగనున్న ఎస్సీ, ఎస్టీ స్థానాలు
26 నుంచి 39కి చేరనున్న మంత్రివర్గ కోటా
దేశంలో 543 నుంచి 850కు పెరగనున్న లోక్‌సభ స్థానాలు
ఇందులో 270 స్థానాలు మహిళలకు రిజర్వేషన్
ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటు ఓటర్ల సంఖ్య 1.60 లక్షలు
రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. లోక్‌సభ స్థానాలు కూడా 25 నుంచి 37 లేదా 38కి చేరనున్నాయి. పెరిగే అసెంబ్లీ స్థానాల్లో సుమారు 86–87, లోక్‌సభ స్థానాల్లో 12–13 మహిళలకు రిజర్వు కానున్నాయి. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా చేసుకుని చేపట్టనున్న ఈ పునర్విభజనతో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల సంఖ్యతోపాటు నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం కూడా మారిపోనుంది. కొత్తగా పెరగనున్న స్థానాలతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఏర్పడనుంది.
50 శాతం సీట్ల పెంపునకు కేంద్రం ఆమోదం
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ స్థానాలను 50 శాతం పెంచడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. పునర్విభజన పూర్తయిన తర్వాత 2051 వరకు అంటే మరో 25 ఏళ్లపాటు కొత్త స్థానాల సంఖ్యనే కొనసాగించాలన్నది ప్రతిపాదన. పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.

37 లేదా 38కి చేరనున్న ఎంపీ సీట్లు
ప్రస్తుతం దేశంలో 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపుతో వాటి సంఖ్య 850కు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ఉంది. ఇందులో 33 శాతం అంటే 270 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 50 శాతం పెంపుతో అదనంగా 12 లేదా 13 స్థానాలు చేరనున్నాయి. ( 50 శాతం అంటే 12.5 స్థానాలు పెరగాలి.. 50 శాతం స్థానాలు పెంచేటప్పుడు 12.4 స్థానాలు వస్తే.. దాన్ని 12గానే పరిగణించి స్థానాలు పెంచుతారు.. 12.6 స్థానాలు వస్తే.. దాన్ని 13 స్థానాలుగా పరిగణించి పెంచుతారు. 12.5 స్థానాలు వస్తే లాటరీ వేస్తారు.. ఆ లాటరీలో రాష్ట్రానికి అనుకూలంగా ఫలితం వస్తే 13 స్థానాలు.. ప్రతికూలంగా వస్తే 12 స్థానాలనే పెంచుతారు.) దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య 37 లేదా 38కి చేరే అవకాశం ఉంది. పెరిగే స్థానాల్లో 33 శాతం చొప్పున 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి.
263కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. 50 శాతం పెంపుతో ఈ సంఖ్య 262 లేదా 263కు చేరనుంది. ఇందులో 33 శాతం చొప్పున 86 లేదా 87 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, జనాభా పంపిణీ ఆధారంగా ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధి మారనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 1.60 లక్షల మంది ఓటర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్యలోనూ మార్పులు
ప్రస్తుతం రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు, ఏడు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. లోక్‌సభలో నాలుగు స్థానాలు (చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం) ఎస్సీలకు, ఒక స్థానం (అరకు) ఎస్టీలకు రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల సంఖ్య పెరగనుంది. ఆయా వర్గాల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త రిజర్వుడు నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఈ సమీకరణ మారనుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య ఒకేలా ఉండకపోవచ్చు. దీంతో నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది.
39కి పెరగనున్న మంత్రివర్గ కోటా
రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్యా పెరగనుంది. శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో కలిపి గరిష్ఠంగా 26 మంది మంత్రులకే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరిగితే మంత్రివర్గ కోటా కూడా 39కి చేరనుంది. దీంతో రాష్ట్రంలో మరో 13 మంది వరకు అదనంగా మంత్రులుగా నియమించుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఐదో సారి నియోజకవర్గాల పునర్విభజన
స్వాతంత్య్రం అనంతరం దేశంలో ఇప్పటివరకు నాలుగు విడతల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952, 1963, 1973, 2002–2008 మధ్య ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు చేపట్టనున్న పునర్విభజన ఐదోది కానుంది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల సంఖ్యను 543కు పరిమితం చేస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధనలు తీసుకొచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లో పార్లమెంటు 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. ఇప్పుడు ఆ రిజర్వేషన్ల అమలుకు వీలుగా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో బిల్లుకు ఆమోదం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది.



