‘ఉద్యోగాల కుంభకోణంపై రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు’ | Shocking details emerge in remand report on job scam Nagarjuna Yadav | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాల కుంభకోణంపై రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు’

Nov 27 2026 6:50 PM | Updated on Nov 27 2026 6:57 PM

Shocking details emerge in remand report on job scam Nagarjuna Yadav

తాడేపల్లి: జనసేన ఆఫీసు కేంద్రంగా జరిగిన ఉద్యోగాల స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ డిమాండ్‌ చేశారు. ఈ స్కాం వెనుక ఎవరున్నారో? వసూలు చేసిన రూ.7 కోట్లు ఎక్కడకు వెళ్లాయో తేల్చాలని చెప్పారు.

తాడేపల్లిలో శుక్రవారం నాగార‍్జున యాదవ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణంపై రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. రుక్మిణి కోటా ఇచ్చిన ఫిర్యాదులు ఒకటి.. నిమ్మకాయల పెద్దిరాజు అరెస్టుకు ఆధారమైన ఎఫ్ఐఆర్ మరొకటి.. ఇదేంటి పోలీసుల విచారణ? నవంబర్ 11న నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను పక్కనపెట్టి.. నవంబర్ 17న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ ఎందుకు? 

రిమాండ్ రిపోర్టులో ధరణి కృష్ణ 2025 నుంచి పరిచయం అని ప్రస్తావన.. రుక్మిణి కోటా ఫిర్యాదులో మాత్రం 2026 జూన్ నుంచి పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ వైరుధ్యానికి సమాధానం చెప్పాలి. 2025లోనే ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు తెరలేచిందని రిమాండ్ రిపోర్టు చెబుతోంది.. మరి ఇన్నాళ్లూ ఎందుకు చర్యలు తీసుకోలేదు? జూలై 2026లోనే బాధితులు దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్లి నకిలీ నియామక పత్రాలపై ఫిర్యాదు చేశారని రిమాండ్ రిపోర్టులో ఉంది. 

బాధితులు తమ వద్దకు రాలేదంటున్న దేవాదాయ శాఖ కమిషనర్.. బాధితులు వెళ్లారని చెబుతున్న రిమాండ్ రిపోర్టు.. నిజం ఏది? జూలైలోనే కుంభకోణం వెలుగులోకి వస్తే దేవాదాయ శాఖ విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు? 40 మందికి పైగా బాధితులు రుక్మిణి కోటా సంస్థ కార్యాలయానికి వెళ్లి డబ్బులు అడిగినా యాజమాన్యానికి తెలియదనడం నమ్మశక్యమా? సెప్టెంబర్ 16న బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించినట్లు బ్యాంకు రసీదులు పంపించారన్న ఆరోపణలపై రుక్మిణి కోటా సమాధానం చెప్పాలి. 

ఫణి ప్రసాద్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి.. 
పవన్ కల్యాణ్ కోఆర్డినేషన్ టీమ్‌లో పనిచేస్తున్న ఫణి ప్రసాద్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ధరణి కృష్ణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఫోన్లపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. కైరం సంస్థ ఖాతాలను ఎందుకు పరిశీలించడం లేదు? రుక్మిణి కోటా, ధరణి కృష్ణ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఫైనాన్షియల్ ఆడిట్ జరిగిందా? జనసేన పార్టీ కార్యాలయం, కైరం సంస్థ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారించాలి. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణం ఉందన్న ఆరోపణలపై ఈడీ కూడా దృష్టి సారించాలి. ధరణి కృష్ణను మాత్రమే నిందితురాలిగా చూపించి.. తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా? 

రుక్మిణి కోటా మీడియా ముందుకు వచ్చి రూ.7 కోట్లు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పాలి. నా మీద, నా కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసే జనసేన నేతలు.. రూ.7 కోట్ల వసూళ్లపై ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రశ్నిస్తే బెదిరింపులు.. సమాధానం అడిగితే దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తారా? 

ఉద్యోగాల కుంభకోణంలో చిన్న చేపలనే పట్టుకుని పెద్ద తలకాయలను వదిలేస్తే ప్రజలు నమ్మరు. సమగ్ర విచారణతో అసలు నిజాలు బయటపెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? జనసేన ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందా? నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రూ.7 కోట్ల కుంభకోణం వెనుక ఉన్న రాజకీయ పలుకుబడి, అధికార అండదండలపై నిష్పక్షపాత విచారణ జరగాలి’’ అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement