నల్లపుల్జేరు పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా! | Sagubadi: Traditional uses and benefits of Black Honey Shrub | Sakshi
Sakshi News home page

నల్లపుల్జేరు పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Nov 27 2026 11:19 AM | Updated on Nov 27 2026 11:19 AM

Sagubadi: Traditional uses and benefits of Black Honey Shrub

ఉనికి:
నల్ల పుల్జేరు చెట్లకు అనేక సుగుణాలు ఉన్నాయి. ఈ చెట్టుకు మొదలు నుండే అనేక కొమ్మలు వస్తాయి. ఒక గుబ్బురు పొదలా ఉంటుంది. ఇవి అంతగా పెరుగవు, వీటి ఎత్తు దాదాపు 3–5 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి పండ్లు కణుపు–కణుపు దగ్గర ఉండి ఆకర్షణీయంగా కనపడుతాయి. ఇవి ప్రపంచంలోని ఉష్ణ మండలాల్లో ఎక్కువగా ఉంటాయి. 

ట్రాపికల్‌ ఆఫ్రికా, సౌత్‌–ఈస్ట్‌ ఆసియా, చైనా, శ్రీలంక, మలేషియా, ఇండియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వీటి ఉనికి అధికం. ఇండియాలో ఇంచుమించు ఈ చెట్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ చెట్లను అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో, పొలంగట్లు తదితర ప్రాంతాల్లో మనం నిత్యం చూస్తుంటాం. నరికివేసినా తిరిగి వేగంగా పెరగగల చెట్టు. ఈ చెట్ల పొదలు సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తు వరకు పెరగ్గలవు.నల్లమల అడవులలోని చెంచు పెంటల దగ్గర అక్కడక్కడా ఈ చెట్లు ఉన్నాయి. ప్రయోజనాలు ఉన్నా ఉపయోగించు కోవటం చాలా తక్కువ.

ప్రయోజనాలు:

  • వీటి మండలు పుల్లల్లాగా ఉండటం వలన తడికెలు కట్టటానికి వీలుంటుంది.

  • వంట చెరుకుగా ఉపయోగపడతాయి.

  • వీటి ఆకులను మేకలకు గ్రాసంగా వాడతారు.

  • వీటి పండ్లు తీపి–వగరుతో కూడుకొని ఉంటాయి. పండ్ల రసం నీలంగా ఉండటం వల్ల తింటే నోరు నీలి రంగుగా మారుతుంది.

  • వీటి పండ్ల నుంచి ఇంక్‌ను తయారు చేయవచ్చు. 

  • వీటి ఆకులు, కొమ్మల నుంచి కషాయం చేసి అందులో దూదిని అద్దటం వల్ల, దూది నల్లరంగును సంతరించుకొంటుంది.

  • వీటి వేర్ల నుంచి ఎర్రటి రంగు వస్తుంది. దీన్ని అద్దకాలలో వాడవచ్చు.

  • ఈ చెట్టులోని అన్ని భాగాలు ఔషధగుణాలు కలిగి ఉన్నాయి. నాటు వైద్యం, ఆయుర్వేదంలో వాడుతున్నారు.

  • పచ్చి పుల్లలతో పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడతాయని చెంచుల నమ్మకం.

  • వీటి బెరడు, పండ్లు, వేర్ల నుంచి వచ్చే ట్యానిన్లను పరిశ్రమల్లో వాడతారు.

  • లావుపాటి కొమ్మల నుంచి బొగ్గును తయారు చేయవచ్చు. బయోచార్‌ తయారీకి ఉపయోగించవచ్చు.

  • ఇటుక బట్టీలను కాల్చటానికి వీటి ఎండిన కొమ్మలను వాడతారు.

  • వీటి వేర్లను ఆస్తమాను తగ్గించటానికి వాడతారు.

  • వీటి బెరడును విరేచనాలు, సుఖరోగాలను నయం చేయటానికి నాటు వైద్యంలో వాడతారు.

  • గుప్పెడు ఆకులను రుబ్బగా వచ్చిన గుజ్జును పార్శ్వ నొప్పి ఉన్నచోట పట్టులా వేయాలి. ఒక గంట తరువాత ఉపశమనం కలుగుతుంది. త్వరగా తగ్గాలంటే, రెండు చుక్కల ఆకుల రసాన్ని పార్శ్వ నొప్పి ఉన్న వైపు ముక్కు రంధ్రంలో వేసుకున్నా ఫలితం ఉంటుంది.

ఇది ఏ కుటుంబానికి చెందిందంటే..

English Name : Black honey shrub 
Scientific Name : Phyllanthus reticulatus Poir. 
Synonym (s) : Kirganelia reticulata (Poir) Baill.
Cicca reticulata (Poir.) Kurz |
Family : Phyllanthaceae
శాస్త్రీయ నామం : ఫిల్లంధస్‌ రెటికులేటర్‌
కుటుంబం : ఫిల్లాంతేసి

నల్లపుల్హేరు పండులో పోషక విలువలు

వివరాలు                 విలువలు

టిఎస్‌ఎస్‌ (బ్రిక్స్‌)        10.00 ±0.43
పిహెచ్‌                     4.20 ± 0.05
తేమ(%)                  78.55 ± 1.39
కొవ్వు                     3.15 ± 0.25
బూడిద (%)             3.99 ± 0.51
క్రూడ్‌ ప్రోటీన్లు            1.41

(Source : వ్యాసకర్త ఈ పోషక విలువల విశ్లేషణ IC-A-RI-IORలో 2023లో ప్రత్యేకంగా చేయించారు).

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement