2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక! | Hanukkah miracle or another war Israeli astrologers predict | Sakshi
Sakshi News home page

2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక!

Nov 26 2026 9:50 AM | Updated on Nov 26 2026 9:50 AM

Hanukkah miracle or another war Israeli astrologers predict

జరూసలేం: ఇరాన్‌- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనే అవకాశాలున్నాయని ఇజ్రాయెల్‌కు చెందిన పలువురు జ్యోతిష్యులు, భవిష్యవాణి చెప్పేవారు అంచనా వేస్తున్నారు. నవంబర్ నెలాఖరుకే పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారవచ్చని జ్యోతిష్యుడు టోమర్ మకోరి హెచ్చరించారు. ఈ సంక్షోభం 2027 ఆగస్టు వరకు లేదా 2028 ఏప్రిల్ వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణ సంస్థ డాబర్ నిర్వహించిన విశ్లేషణలో ఇజ్రాయెల్ జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, భవిష్యవాణి చెప్పేవారి మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఇరాన్‌తో వ్యవహారం ఇంకా ముగియలేదని మకోరి వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌కు చెందిన రికి కిట్రో స్వల్పకాలిక సైనిక ఘర్షణ జరిగే అవకాశముందని, అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేశారు. ఇరాన్, గాజా, లెబనాన్ ప్రాంతాలను కలుపుతూ బహుముఖ ఘర్షణ తలెత్తవచ్చని ఈడెన్ హోదయా కోహెన్ పేర్కొన్నారు. అయితే అందరూ యుద్ధం తప్పదని చెప్పడం లేదు. ఉద్రిక్తతలు చివరకు చర్చలకు దారితీస్తాయని న్యూమరాలజిస్ట్ నహుమ్ తమీర్ అభిప్రాయపడ్డారు. విమాన ప్రయాణాలు, వివాహాలు సహా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాన్ని సైకిక్ హాయ్ అమిత్ కూడా తోసిపుచ్చుతూ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు.

త్వరలో జరగనున్న యూదుల పండుగ హనుక్కా కూడా ఇజ్రాయెల్‌లో చర్చనీయాంశంగా మారింది. పండుగ వేళ యుద్ధం మొదలవుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతుండగా, మరికొందరు అద్భుతం జరిగి శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నారు. యుద్ధం ఉండదని భరోసా ఇచ్చినవారి అంచనాలకు సోషల్ మీడియాలో ఎక్కువ స్పందన లభించినట్లు డాబర్ విశ్లేషణ వెల్లడించింది. అయితే జ్యోతిష్యుల అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, వాటిని ధ్రువీకరించిన సైనిక నిఘా సమాచారంగా పరిగణించరాదని స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీన్‌ఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. అయితే అమెరికా సైన్యం లక్ష్యంగా పెట్టుకున్న 38 వంతెనలను కేవలం గంటలోనే ధ్వంసం చేయగలమని వ్యాఖ్యానించారు. నవంబర్ 7న అమెరికా సెంట్రల్ కమాండ్ పర్షియన్ గల్ఫ్‌లో నౌకాదళ దిగ్బంధనాన్ని విస్తరించినట్లు ప్రకటించింది. భూభాగ మార్గాలు, కాస్పియన్ సముద్ర నెట్‌వర్క్‌లను కూడా ఇందులో చేర్చినట్లు తెలిపింది. ఇరాన్‌లోకి ఎలాంటి సరుకు వెళ్లకుండా, అక్కడి నుంచి బయటకు రాకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌తో మరోసారి యుద్ధం వస్తుందా? లేక దౌత్య చర్చలతో ఉద్రిక్తతలు తగ్గుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌తో భేటీ.. కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement