న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన ‘బరాక్’ పాయింట్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఆధునీకరించేందుకు, కాలంచెల్లిన భాగాలను భర్తీ చేసేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో సుమారు రూ.1,976 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా సదరు క్షిపణి వ్యవస్థకు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లలో సమగ్రమైన ఆధునీకరణ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


