చిన్న గాట్లతోనే పూర్తి
ఎస్‌ఎస్‌ఐ ఇన్నోవేషన్స్ ఘనత
ఢిల్లీలోని మెదాంతాలో తొలి సర్జరీ సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం పడింది. కత్తిగాటు లేకుండా, ఛాతీ ఎముకలను కోయకుండానే గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీని చేయగల సరికొత్త రోబోటిక్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి రోబో ఒకటి అమెరికాలో చాలాకాలంగా పనిచేస్తున్నప్పటికీ ఎస్‌ఎస్‌ఐ ఇన్నోవేషన్స్ తయారు చేసిన ‘మంత్ర’ రోబో ప్రత్యేకతలు వేరు. ఐదు రోబో చేతులు, రెండు కన్సోల్స్ ఉన్న మొదటి రోబో వ్యవస్థ ఇదే.
ఈ రోబోను గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రిలో బుధవారం మొట్టమొదటిసారి విజయవంతంగా ఉపయోగించారు. ఆసుపత్రి రోబోటిక్ విభాగపు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ నితిన్ కుమార్ రాజ్‌పూత్, మణిపాల్ (జైపూర్) ఆసుపత్రి చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లలిత్ మాలిక్‌లు ఈ శస్త్రచికిత్సను నిర్వహించగా, దేశ రోబోటిక్ సర్జరీ పితామహుడిగా భావించే డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌ఐ ఇన్నోవేషన్స్ అభివృద్ధి చేసిన ‘మంత్ర’ రోబోటిక్ సిస్టమ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ‘మేక్ ఇన్ ఇండియా, ఫర్ ది వరల్డ్’ నినాదానికి అసలైన నిదర్శనంగా నిలిచిందన్నారు. హార్ట్–లంగ్ మెషీన్ సహాయం లేకుండా, రోగి గుండె కొట్టుకుంటున్న సమయంలోనే, ఛాతీని కోయకుండానే చిన్న కోతలతో బైపాస్ సర్జరీ నిర్వహించామని చెప్పారు.
డ్యూయల్–కన్సోల్ టెక్నాలజీ కారణంగా ఇద్దరు సీనియర్ సర్జన్లు ఏకకాలంలో ఐదు రోబో చేతులతో పనిచేయించవచ్చునని ఇది ప్రపంచంలోనే మొదటిసారి అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతతో రోగులకు గుండె శస్త్రచికిత్సలు మరింత సులభతరంగా మారడమే కాకుండా, శస్త్రచికిత్స తర్వాత ఆసుపత్రిలో కోలుకునే సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని డాక్టర్ శ్రీవాత్సవ వివరించారు.


