కాలేజ్ చదువు అనగానే యువత భవిష్యత్తులో ఏమవుదాం అనే దానిపై కసరత్తులు చేస్తుంటారు. డిగ్రీ పూర్తి చేసి..ఆపై ఎలాంటి కోర్సులు చేద్దాం లేక ఏదైనా బిజినెస్? లేక ఉద్యోగమా? అన్న హడావిడిలో ఉంటారు. కానీ ఈ అమ్మాయి డిగ్రీ ఫైనలియర్ చదవుతూ కేఫ్ ప్రారంభించింది. నిజానికి చివరి ఏడాది అంటే ఏ రేంజ్‌లో యువత బిజీగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆమె మాత్రం చకచక కేఫ్ ప్రారంభించడమే కాకుండా..తక్కువ టైంలోనే ఏ రేంజ్‌లో లాభాలు అందుకుందో తెలిస్తే కంగుతింటారు.
ఆ అమ్మాయే గురుగ్రామ్‌కి చెందిన అనన్య అగర్వాల్. ఈ 21 ఏళ్ల యువతి డిగ్రీ ఫైనలియర్‌లో ఉంది. కాలేజ్‌లో ఉండే అన్నీ సవాళ్లను సమతుల్యం చేస్తూనే తన సొంత కేఫ్‌ని ప్రారంభించింది. ఆ కేఫ్ పేరు 'లూమ్ అండ్ లైమ్'. ఇది జస్ట్ 50 రోజుల్లనే రూ. 15 లక్షలు సంపాదించింది. మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఫైనలియర్ బ్యాచిలర్ డిగ్రీ ఒక పక్క మరోవైపు రెస్టారెంట్ సహా వ్యవస్థాపకురాలు ,సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఆమె ఈ రెండింటికి సమయం కేటాయించుకుంటూ ముందుకు సాగుతోంది.
ఒకపక్క తన గ్రేడ్‌లు కాపాడుకుంటూనే..ప్రాజెక్టుల్లో కూడా భాగమవ్వాల్సి ఉంటుంది. మరోవైపు రెస్టారెంట్లో అన్ని సజావుగా జరిగేలా చూసుకోవాలి. అయినప్పటికీ ఆమె ఈ జర్నీలో అన్నీ నేర్చుకుంటూనే..సీఈవోగా ఈ కేఫ్‌ని సమర్థవంతంగా రన్ చేయడం విశేషం. తన కేఫ్‌ని ప్రత్యేకంగా నిలబట్టే వాటి గురించి కూడా మాట్లాడింది అనన్య. భారత్‌లో మనం ఇటాలియన్, మెడిటరేనియన్ లేదా మెక్సికన్ వంటకాలకు మన రుచిని జోడించే ప్రయత్నంలో ఎక్కువ మసాలాలు కలిపేస్తుంటామని, దాంతో టేస్ట్ పాడవుతుందని చెబుతోంది.
అందుకే అసలు రుచి పాడవ్వకుండా.. టేస్టీగా సర్వ్ చేయడమే తన రెస్టారెంట్ స్పెషాల్టీ అని పేర్కొందామె. తమది శాకాహారుల కోసమే వివిధ రుచులను ఆప్యాయంగా అందించే కేఫ్ అని చెబుతోంది. వీటితోపాటు ప్రత్యేక కాఫీ, ఇతర డెజర్ట్‌లను కూడా సర్వ్ చేస్తుందని తెలిపింది. నాన్‌వెజ్‌కి ధీటుగా వీగన్‌లో ఎలాంటి ఆస్వాదించొచ్చో మా మెనూనే చెప్పేస్తుందని నవ్వుతూ చెబుతోంది అనన్య. ఆ కారణంగానే తన కేఫ్ ప్రారంభించిన 50 రోజులకే రూ. 15 లక్షలు ఆర్జించిందని చెప్పుకొచ్చింది.
అంతేగాదు ప్రత్యేకమైన బ్రెడ్‌లు, చేతితో తయారు చేసిన పాస్తాలు, వివిధ రకాల ఫ్రైస్‌లు దొరుకుతాయని చెబుతోంది. చదవుతూనే పార్ట్‌టైం ఉద్యోగాలు చేయడం చూశాం గానీ ఒక వ్యవస్థాపకురాలిగా మారి ఓ వ్యాపారాన్ని నిర్మిస్తూనే మరోవైపు నిరాటంకంగా స్టడీస్ కొనసాగిస్తూ..యువతకు స్ఫూర్తిగా నిలిచింది. పైగా ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు ఆమె కథ ప్రేరణ కూడా.
ఇదీ చదవండి: ఒత్తిడి నిండిన ఐటీ ఉద్యోగంలోనూ.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండిలా!


