పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో చాలా మటుకు అట్టడుగు నుంచి ప్రారంభమైనవే. అలా చిన్న స్వీట్ షాపుతో మొదలైన ప్రయాణం.. నేడు దేశవిదేశాల్లో 185కి పైగా ఔట్‌లెట్లతో విస్తరించిన వ్యాపారంగా ఎదిగింది. వ్యవసాయంలో ఎదురైన నష్టాలను అధిగమించి, పట్టుదలతో ఆహార రంగంలో తనదైన గుర్తింపు సంపాదించిన కె.ఎస్. తిరుపతి రాజా కథ ఇది. నేడు ఆయన స్థాపించిన అడయార్ ఆనంద భవన్ (A2B) దక్షిణ భారతదేశంలో ప్రముఖ స్వీట్లు, స్నాక్స్, శాకాహార రెస్టారెంట్ బ్రాండ్‌గా ఎదిగింది.
వ్యవసాయంలో ఎదురైన నష్టాలు..
తమిళనాడులోని రాజపాళయానికి చెందిన తిరుపతి రాజా.. చెన్నై, ముంబైల్లో టేబుల్ క్లీనర్‌గా పనిచేస్తూ ఆహార తయారీలో అనుభవం సంపాదించారు. అనంతరం స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని స్వగ్రామానికి తిరిగొచ్చారు. పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేపట్టి, అప్పులు చేసి మరిన్ని పొలాలను లీజుకు తీసుకున్నారు. అయితే దుమ్ము తుఫాను పంటలను నాశనం చేయడంతో భారీ నష్టాలు ఎదురయ్యాయి.
దీంతో వ్యవసాయాన్ని వదిలి 1960లో రాజపాళయంలో ‘గురు స్వీట్స్’ పేరుతో చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. తర్వాత 1970ల మధ్యలో కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లి ‘శ్రీనివాస స్వీట్స్’ను నడిపారు. భార్య, కుమారులు కె.టి. వెంకటేశన్, కె.టి. శ్రీనివాస రాజా వ్యాపారంలో తోడ్పడ్డారు.
చెన్నైలో బ్రాండ్ ఆవిర్భావం
తిరుపతి రాజా కుటుంబం 1979లో చెన్నైలోని వాషర్‌మన్‌పేటలో ‘శ్రీ ఆనంద భవన్’ను ప్రారంభించింది. అనంతరం అడయార్‌లో మరో దుకాణం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ మర్రిచెట్టు నుంచి ప్రేరణ పొంది, 1980లలో ‘అడయార్ ఆనంద భవన్’గా పేరు మార్చుకున్నట్లు సంస్థ చరిత్ర చెబుతోంది.
తొలుత స్వీట్లు, కారాలు, స్నాక్స్ విక్రయాలపై దృష్టి పెట్టిన సంస్థ.. క్రమంగా ఇతర ప్రాంతాల వంటకాలను కూడా పరిచయం చేసింది. 2005లో A2B బ్రాండ్‌తో శాకాహార రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. దీంతో ప్యాకేజ్డ్ స్వీట్లు, స్నాక్స్ విక్రయాలతో పాటు రోజువారీ భోజన సేవలూ అందించే స్థాయికి ఎదిగింది.
విదేశాలకూ విస్తరణ.. ఆన్‌లైన్ సేవలు
తమిళనాడు నుంచి ఇతర భారతీయ నగరాలకు విస్తరించిన A2B.. అమెరికా, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. 2018లో సొంత డెలివరీ యాప్‌ను ప్రవేశపెట్టి ఆన్‌లైన్ ఆర్డర్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్వీట్లు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తులు, గిఫ్ట్ హ్యాంపర్లు, రెస్టారెంట్లతో పాటు ఆతిథ్య రంగంలోనూ సేవలు అందిస్తోంది.
2001లో తిరుపతి రాజా మరణించిన తర్వాత ఆయన కుమారులు వెంకటేశన్, శ్రీనివాస రాజా వ్యాపార బాధ్యతలను చేపట్టారు.
రూ.1,700 కోట్లకు చేరిన ఆదాయం
వ్యాపార విస్తరణతో పాటు సంస్థ ఆదాయమూ పెరిగింది. ట్రాక్సన్ సమాచారం ప్రకారం, 2015 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.571 కోట్లుగా ఉన్న ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరానికి రూ.861 కోట్లకు చేరింది. అయితే కరోనా ప్రభావంతో 2021లో రూ.516 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత వేగంగా కోలుకుని 2023లో రూ.1,200 కోట్ల మార్కును దాటింది.
కంపెనీ ఆర్థిక వివరాల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,406 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025లో సుమారు రూ.1,502 కోట్లకు చేరింది. అదే ఏడాది నికర లాభం రూ.36 కోట్లకు పైగా నమోదైంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 185కి పైగా ఔట్‌లెట్లు, 12,000 మందికి పైగా ఉద్యోగులు, రూ.1,700 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్నట్లు సంస్థ వెబ్‌సైట్ పేర్కొంటోంది. అయితే ఈ టర్నోవర్ సంస్థ వెల్లడించిన ప్రస్తుత గణాంకం కాగా, అందుబాటులో ఉన్న తాజా ఆర్థిక నివేదికలు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి.
వ్యవసాయంలో ఎదురైన భారీ నష్టాన్ని మరో వ్యాపారానికి పునాదిగా మార్చుకున్న తిరుపతి రాజా.. కుటుంబం కలిసికట్టుగా పనిచేస్తే చిన్న దుకాణాన్ని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చని నిరూపించారు.


