బంగారం, వెండి.. విలువైన లోహాలు. వీటిని ఆభరణాలకు, పెట్టుబడి సాధనంగా ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధరల్లో మాత్రం రెండింటి మధ్య అంతరం భారీగానే ఉంటుంది. వెండి కిలోల్లో కొనగలిగే డబ్బుకు బంగారం కేవలం గ్రాముల్లోనే వస్తుంది. ఇటీవల కాలంలో వీటి ధరలు పోటాపోటీగా పెరుగుతూ వచ్చాయి.
అయితే వెండి ధరలు భారీగా పడిపోవడంతో బంగారం, వెండి మధ్య ధరల అంతరం వేగంగా తగ్గుతోంది. ఒకప్పుడు కిలో వెండి విలువ రెండు తులాల బంగారం ధరను మించగా.. ఇప్పుడు ఆ వ్యత్యాసం గణనీయంగా తగ్గింది. వెండి మరింత క్షీణిస్తే కిలో వెండి ధర ఒక తులం బంగారం విలువకు చేరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అక్టోబర్ 30న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ కిలోకు సుమారు రూ.1.79 లక్షలకు పడిపోయాయి. బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1.38 లక్షల స్థాయికి చేరాయి. దీంతో రెండింటి మధ్య ధరల వ్యత్యాసం సుమారు రూ.40 వేలుగా ఉంది. జనవరిలో వెండి కిలో ధర రూ.4.20 లక్షల గరిష్ఠాన్ని తాకగా.. అప్పటి నుంచి దాదాపు 57 శాతం క్షీణించింది. బంగారం మాత్రం జనవరి గరిష్ఠంతో పోలిస్తే సుమారు 23 శాతం తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్సుకు 50 డాలర్ల దిగువకు పడిపోయి, దాదాపు 11 నెలల కనిష్ఠానికి చేరింది. బంగారం ధర కూడా ఔన్సుకు 4,000 డాలర్ల దిగువకు పడిపోయి ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసింది. జనవరిలో వెండి 122 డాలర్ల రికార్డు స్థాయిని తాకగా.. ప్రస్తుతం దాని నుంచి సుమారు 60 శాతం తగ్గింది. బంగారం 5,595 డాలర్ల గరిష్ఠంతో పోలిస్తే దాదాపు 30 శాతం క్షీణించింది.
పతనానికి కారణాలివే..
అమెరికా టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, కృత్రిమ మేధ (ఏఐ) పెట్టుబడులపై ఆందోళనలు విలువైన లోహాలపైనా ప్రభావం చూపాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చన్న అంచనాలు కూడా బంగారం, వెండిపై ఒత్తిడి పెంచాయి. పెట్టుబడిదారులు నష్టాలను పూడ్చుకునేందుకు ఇతర ఆస్తులను విక్రయించడం కూడా ధరల పతనానికి కారణమైంది.
బంగారంతో పోలిస్తే వెండిపై పారిశ్రామిక డిమాండ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలు, పరిశ్రమల వినియోగం తగ్గే అంచనాలు వెండిని మరింత దెబ్బ తీస్తున్నాయి. మరోవైపు, వెండి సరఫరా కొరత తగ్గుతోందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.
మరింత తగ్గే అవకాశం ఉందా?
బంగారం-వెండి నిష్పత్తి ప్రస్తుతం సుమారు 79కు చేరింది. అంటే ఒక ఔన్సు బంగారం కొనుగోలు చేయడానికి దాదాపు 79 ఔన్సుల వెండి అవసరం. 2020–2025 మధ్య ఈ నిష్పత్తి సగటున 82గా ఉంది. ఆ స్థాయికి చేరితే ప్రస్తుత బంగారం ధరల ఆధారంగా ఎంసీఎక్స్ వెండి కిలో ధర రూ.1.69 లక్షల సమీపానికి రావచ్చన్న అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: రూ.12000 లకే కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయ్..!
అయితే, వెండి ధరలు తులం బంగారంతో సమానమవ్వాలంటే ఇంకా గణనీయంగా తగ్గాల్సి ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులు, డాలర్ కదలికలు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, పారిశ్రామిక డిమాండ్ తదుపరి ధరల దిశను నిర్దేశించనున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


