దిగొచ్చిన బంగారం.. కొనేందుకు మంచి తరుణం! | Gold Prices Drop and Is This the Right Time to Invest | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన బంగారం.. కొనేందుకు మంచి తరుణం!

Nov 2 2026 7:47 AM | Updated on Nov 2 2026 7:52 AM

Gold Prices Drop and Is This the Right Time to Invest

అమెరికన్‌ డాలర్ల మారకంలో అంతర్జాతీయంగా.. బంగారం ధరలు 2026 జనవరి చివర్లో ఔన్సుకు (31.1 గ్రాములు) దాదాపు 5,600 డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. ఆ తర్వాత అక్టోబర్‌ 16 నాటికి స్పాట్‌ మార్కెట్లో గోల్డ్‌ ధర దాదాపు 4,179 డాలర్లకు.. అటు పైన అక్టోబర్‌ 30 నాటికి  కీలకమైన 4,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అంటే దాదాపు 25 శాతం పైగానే పతనమైంది (దేశీయంగా రూపాయి మారకంలో చూస్తే స్పాట్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర జనవరి నాటి రికార్డు స్థాయి దాదాపు రూ. 1,83,000 నుంచి ప్రస్తుతం రూ. 1,45,000కు క్షీణించింది).  దీనితో బుల్‌ మార్కెట్‌ ముగిసిందా, ధన్‌తేరాస్‌ సందర్భంగా కొనుగోళ్లకు అనువైన సమయమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పరిశ్రమల సంఘం అసోచామ్‌ అంచనా ప్రకారం 2026 ఏప్రిల్‌ నాటికి, భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన బంగారం ఉంది. ఇది ప్రపంచంలోని టాప్‌ టెన్‌ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల విలువ కంటే ఎక్కువ. భారతీయుల పొదుపు విధానాల్లో బంగారం విడదీయలేని భాగంగా ఉంటోంది.

ఇక ధన్‌తేరస్‌ పండుగ సందర్భంగా పసిడి కొనుగోళ్లపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా బంగారం కొనుక్కోవాలా వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ, ధరల దిద్దుబాటు అనేది పసిడిని మరింత ఆకర్షణీయంగా మార్చిందని అర్థ భారత్‌ భావిస్తోంది. నెమ్మదిగా ధరల పతనానికి కారణమైన ఒత్తిడి తగ్గుతోంది. దీర్ఘకాలిక దృక్పథం ఉన్న వారు కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు గిఫ్ట్‌ సిటీ ద్వారా భౌతిక బంగారాన్ని సొంతం చేసుకునేందుకు మరో మార్గం అందుబాటులోకి వచ్చింది.

ఆకర్షణీయంగానే..
అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. జనవరి చివర్లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు, పదేళ్ల కాలపరిమితి గల అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడి సుమారు 4.24 శాతంగా ఉంది. అక్టోబర్‌ 5 నాటికి అది 5.31 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే పదేళ్ల బాండ్లపై రాబడి కూడా 2.92 శాతానికి చేరింది. ఇది 2008లో నమోదైన రికార్డు స్థాయికి దగ్గరగా ఉంది.

వడ్డీ ఆదాయం అందించని బంగారంలాంటి అసెట్‌తో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.  అయినప్పటికీ, బంగారం ఈ ప్రతికూల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకుంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే బాండ్లపై రాబడులు కొత్త గరిష్టాలను తాకినప్పటికీ, పసిడి ధర జూన్‌ చివరి నాటి దాదాపు 4,000 డాలర్ల స్థాయికి దరిదాపుల్లోనే కొనసాగుతోంది.

దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో వ్యవహరించే కొనుగోలుదారులు బంగారం మార్కెట్‌కి దూరం కాలేదు. 2026 రెండో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు నికరంగా 289 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి ఇవి రికార్డు స్థాయి కొనుగోళ్లు. ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, పోలాండ్, చైనా వంటి దేశాల సారథ్యంలో ఈ కొనుగోళ్లు కొనసాగాయి. దేశీయంగా సెపె్టంబర్‌ నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి నికరంగా రూ. 4,451 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ఎంత కేటాయించవచ్చు
వివిధ అసెట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గించడంతో పాటు రిస్ప్‌కి తగ్గట్లు మెరుగైన రాబడులను అందించడంలో సహాయపడుతుంది. అయితే, బంగారం దానంతట అదే ఎలాంటి ఆదాయాన్ని అందించదు కాబట్టి రుణ సాధనాలు, ఈక్విటీల్లాగా వడ్డీ లేదా డివిడెండ్లను అందించని పసిడికి ఎంత మేర పెట్టుబడులు కేటాయించాలనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికో విధానం పాటించవచ్చు.

ఇన్వెస్టరు దగ్గర ఇప్పటికే ఉన్న బంగారం, పెట్టుబడి లక్ష్యాలు, మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం ఆధారంగా కేటాయింపు ఉండాలి. వివిధ రకాల అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే చాలా మంది మదుపరులు, తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సుమారు 10 నుంచి 15 శాతం వరకు పసిడికి కేటాయించడం దీర్ఘకాలిక వ్యూహంగా ఉండవచ్చు. పసిడిలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే, ఆరు నుంచి పన్నెండు నెలల వ్యవధిలో దశలవారీగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. తగిన వ్యవధిని ఎంచుకుని సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈ విధానాన్ని సులభంగా అమలు చేయొచ్చు.

ఇలా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు
బంగారంలో మదుపు చేయడానికి సంబంధించి సంప్రదాయ మార్గాల్లో ఒక్కో దానికీ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే, తయారీ చార్జీలు, స్వచ్ఛతకు సంబంధించిన రిస్క్‌లు ఉంటాయి. వాటిని విక్రయించేటప్పుడు కూడా కొన్ని కోతలు విధిస్తారు కాబట్టి అమ్మడం సైతం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. దేశీయంగా కొనుగోలు చేసే బంగారం రేటును రూపాయల్లో నిర్ణయిస్తారు.

అంతర్జాతీయ రేటుకు అదనంగా దిగుమతి సుంకం కూడా దీనికి వర్తిస్తుంది. గిఫ్ట్‌ సిటీ అంతర్జాతీయ ధరలతో పాటు భౌతిక రూపంలో బంగారం, భారత్‌లోనే భద్రపరిచే సదుపాయంలాంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 2022లో ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్చేంజ్ (ఐఐబీఎక్స్‌), లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ (ఎల్‌బీఎంఏ) ప్రమాణాలకు అనుగుణంగా బంగారాన్ని అంతర్జాతీయ డాలర్‌ ధరల ఆధారంగా ట్రేడింగ్‌ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ బంగారాన్ని గిఫ్ట్‌ సిటీలోని బీమా సదుపాయం కలిగిన వాల్ట్‌లలో భద్రపరుస్తారు.

2026 జనవరిలో ఐఎఫ్‌ఎస్‌సీఏ చట్టం కింద కమోడిటీ ట్రేడింగ్‌ను ఫైనాన్స్‌ ప్రొడక్టుగా ప్రకటించినప్పటి నుంచి నియంత్రిత ఫండ్లు ఈ తరహా బంగారంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలు కలిగింది. ఫలితంగా మదుపరులకు తక్కువ ఖర్చుతో, నిపుణుల పర్యవేక్షణలో బంగారాన్ని భద్రపరిచే సదుపాయం లభిస్తుంది. బంగారాన్ని కడ్డీల రూపంలో వ్యక్తిగతంగా కొనుగోలు చేసే వారు ఇలాంటి సదుపాయాలను సులభంగా పొందలేరు. అంతేకాకుండా, ఫండ్ల విలువను పటిష్టమైన విదేశీ కరెన్సీల మారకంలో నిర్ణయిస్తారు కాబట్టి భవిష్యత్తులో రూపాయి విలువ తగ్గినా.. కొంత రక్షణ పొందవచ్చు.

చివరిగా చెప్పాలంటే అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు నెమ్మదించి, సెంట్రల్‌ బ్యాంకులు పసిడి కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉన్న నేపథ్యంలో ధన్‌తేరాస్‌ సందర్భంగా దీర్ఘకాలిక కోణంలో ఇన్వెస్టర్లు పసిడిలో పెట్టుబడులను పెంచుకోవడానికి అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement