భారతీయ రైల్వే రంగం సరికొత్త చరిత్ర సృష్టించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దేశీయంగా విజయవంతంగా తయారవుతున్న సెమీ హైస్పీడ్ ‘వందే భారత్’ రైళ్లను ఇకపై అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో భారతీయ వందే భారత్ రైళ్లు విదేశీ పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. దేశ రాజధాని నుంచి వారణాసి వంటి కీలక మార్గాల విస్తరణ, అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం నేపథ్యంలో మంత్రి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రతకు పెద్దపీట వేస్తూ..
గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న వందే భారత్ రైళ్లు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. స్వదేశీ ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతున్న ఈ ట్రైన్ సెట్స్‌ను కేవలం దేశీయ అవసరాలకే పరిమితం చేయకుండా గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలు, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ రైళ్లకు త్వరలోనే ప్రపంచ దేశాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడనుందని రైల్వే శాఖ గట్టి విశ్వాసంతో ఉంది.
రైల్వే మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, దేశీయంగానే రైళ్ల తయారీని ప్రోత్సహిస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం ప్రయాణికుల రవాణాలోనే కాకుండా అత్యాధునిక హై-స్పీడ్ కారిడార్లు, పర్యావరణహిత గ్రీన్ టెక్నాలజీ వైపు కూడా భారత్ అడుగులు వేస్తోంది. రాబోయే 3-4 ఏళ్లలో వందే భారత్ రైళ్ల ఎగుమతి ప్రారంభమైతే భారత్ కేవలం దిగుమతిదారుల దేశంగా కాకుండా.. అత్యాధునిక రైల్వే టెక్నాలజీని ఎగుమతి చేసే అగ్రగామి దేశాల సరసన నిలవనుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌ను కీలక భాగస్వామిగా మారుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?


