భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకూ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఖరీదైన యాపిల్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కూడా వినియోగదారులు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీ
2028 అక్టోబర్ నాటికి దేశీయ డిజైన్, తయారీ, సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఫోన్లు భవిష్యత్తులో యాపిల్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సైతం పోటీ ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఫోన్‌ను భారత్‌లో తయారు చేయడం వేరు.. దాని డిజైన్, టెక్నాలజీని కూడా మనమే అభివృద్ధి చేయడం వేరని అశ్విని వైష్ణవ్ వివరించారు. స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, మెమరీ వంటి అనేక భాగాలు ఉంటాయి. వీటన్నింటినీ తక్కువ స్థలంలో అమర్చి, ఫోన్ వేగంగా పనిచేసేలా రూపొందించడం అంత సులభం కాదు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు అవసరం. ఈ దిశగా భారత్ ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు ప్రారంభించిందని మంత్రి చెప్పారు.
దేశీయ డిజైన్
మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCB) డిజైన్‌ను అభివృద్ధి చేయాలని దేశీయ కంపెనీలకు ప్రభుత్వం సవాలు విసిరిందని తెలిపారు. ఈ ప్రయత్నంలో రెండు కంపెనీలు ముందుకు రాగా, వాటిలో ఒక కంపెనీ రూపొందించిన డిజైన్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ ఎంపిక చేసుకుందని వెల్లడించారు. ఆ కంపెనీ 5జీ సామర్థ్యాలున్న మొబైల్ ఫోన్‌ను రూపొందించి, సదరు సంస్థకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ అనుభవంతో భారత్ సొంత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను అభివృద్ధి చేయగలదన్న నమ్మకం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాలు పెరుగుతాయా?
ప్రస్తుతం భారత్‌లో యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీల ఫోన్లు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. అయితే.. ఆ కంపెనీల కోసం ఫోన్లు తయారు చేయడానికి, మన సొంత బ్రాండ్‌తో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా తేడా ఉంది. సొంత బ్రాండ్ వస్తే.. ఫోన్ డిజైన్ నుంచి టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, అమ్మకాల వరకు భారతీయ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాలు, దేశీయ కంపెనీల వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ.. యాపిల్, శాంసంగ్‌తో పోటీ పడాలంటే ధరతో పాటు ఫోన్ నాణ్యత, పనితీరు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలోనూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవాలి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు కష్టకాలం.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఇదే!


