ఉద్యోగులకు కష్టకాలం.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఇదే! | Techie Viral Post Highlights Tough Job Market for IT Professionals | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు కష్టకాలం.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఇదే!

Oct 24 2026 4:28 PM | Updated on Oct 24 2026 4:50 PM

Techie Viral Post Highlights Tough Job Market for IT Professionals

ఐటీ రంగంలో జాబ్ ఉంటే భవిష్యత్తుకు ఢోకా లేదనే రోజులు పోయాయి. ఎందుకంటే.. ప్రస్తుతం టెక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఒకవైపు ఉద్యోగాల కోతలు, మరోవైపు జీతాల పెంపు లేకపోవడం.. ఇంకోవైపు కొత్త ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ. ఇలా ఐటీ ఉద్యోగులకు కష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

అనుభవం ఉన్నవారు సైతం కొత్త ఉద్యోగం కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని.. టెక్ ప్రొఫెషనల్ అమర్‌నాథ్ శివశంకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టెక్నికల్ మేనేజర్ పోస్టు కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో తనకు ఎదురైన రెండు అనుభవాలను అమర్‌నాథ్ పంచుకున్నారు. ఒక అభ్యర్థి పనిచేస్తున్న కంపెనీని అంతర్జాతీయ ఐటీ సంస్థ కొనుగోలు చేయడంతో ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇంకా అవకాశం దొరకలేదు. మరో అభ్యర్థి మాత్రం మూడేళ్లుగా జీతం పెరగకపోవడంతో తాను పనిచేస్తున్న ఇండియా ఐటీ సంస్థకు రాజీనామా చేశాడు. ఈ రెండు ఘటనలు ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగం ఉన్నా.. లేకున్నా.. రోజువారీ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. జీతాలు పెరగకపోవడం, ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెంటనే దొరుకుతుందనే నమ్మకం లేకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. కంపెనీల్లో ఉద్యోగాల కోసం పోటీ పెరగడంతో అర్హతలు, అనుభవం ఉన్నవారికి కూడా ఇంటర్వ్యూ అవకాశం రావడం కష్టమవుతోందని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా స్పందిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన తన బంధువు బెంగళూరులో ఉద్యోగంలో చేరినా, రోజుకు 13 గంటలు పనిచేయాల్సి రావడం, వారాంతాల్లోనూ విధులకు హాజరుకావాల్సి రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాడని ఓ వ్యక్తి తెలిపారు. అయితే.. ఉద్యోగం మానేసిన తర్వాత మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నా సరైన ఉద్యోగం దొరకలేదని మరొకరు చెప్పారు. దీంతో ఉద్యోగం మారాలనుకునేవారు కూడా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని ఉన్న ఉద్యోగం కాపాడుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: అంతలోనే ఆశలు ఆవిరి.. తిరగబడిన పసిడి ధరలు!

మారుతున్న పరిస్థితుల్లో.. మరో మంచి ఉద్యోగం ఖరారయ్యే వరకు చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకపోవడమే మంచిదని అమర్‌నాథ్ సూచించారు. ముఖ్యంగా ఆర్థికంగా తగినంత పొదుపు లేకుండా రాజీనామా చేస్తే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, పని ఒత్తిడి, జీతం, కెరీర్ వృద్ధి వంటి అంశాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement