గమ్యం చేరిన రైలును ఖాళీగా ఉంచకుండా మరో రూట్‌కు లింకు
ఎక్కడ జాప్యం జరిగినా కొన్ని గంటల ఆలస్యంగా రాక
దీంతో జత రైలు ఆలస్యం అంటూ అసలు ట్రిప్పు రీషెడ్యూలింగ్.. స్పేర్‌కోచ్‌ల కరువుతో ప్రయాణికులకు నరకం
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని లింగంపల్లి స్టేషన్‌లో బయలుదేరాల్సిన కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ సోమవారం తెల్లవారుజాము నాలుగింటికి బయలుదేరింది. ఇది కాకినాడకు షెడ్యూల్ కంటే ఏకంగా 9 గంటల ఆలస్యంగా చేరుకుంది. ఇది రైలు గమ్యం చేరటానికి పట్టే ప్రయాణ సమయమంత ఉండటం గమనార్హం. రైలు సమయాన్ని రీషెడ్యూల్ చేసినట్టు ప్రయాణికులకు రైలు బయలుదేరటానికి మూడు గంటల ముందు సమాచారం అందించారు. అత్యవసర పనుల్లో ఉన్న ప్రయాణికులకు ఇది దిక్కుతోచని పరిస్థితి.
సాక్షి, హైదరాబాద్: వీలైనంత ఆదాయాన్ని పొందే ప్రయత్నంలో రైల్వే శాఖ తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉన్నట్టుండి రైళ్ల వేళలను సవరిస్తూ, ప్రయాణానికి తక్కువ వ్యవధి ముందు ప్రకటిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రైల్వేలో ‘రేక్ షేరింగ్’ విధానం అమలులో ఉంది. ఒక రైలు గమ్యం చేరిన తర్వాత, మళ్లీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవటానికి కొన్ని గంటల సమయం ఉంటుంది. అప్పటి వరకు దాన్ని అలా వృథాగా ఉంచకుండా, దాన్ని మరో షార్ట్ ట్రిప్‌కు తరలిస్తారు. అది మరో పేరుతో ఆ ట్రిప్‌లో భాగంగా తిరిగి మరుసటి రోజు ప్రయాణం ప్రారంభించాల్సిన స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ మూడు నాలుగు గంటల సర్వీసింగ్ పనులు పూర్తి చేసుకుని మళ్లీ మొదటి గమ్యం ప్రయాణానికి సిద్ధమవుతుంది.
ఇలా త్రికోణ రూట్ షెడ్యూల్‌తో రైళ్లు నడుస్తాయి. ఇందులో ఎక్కడ ఆలస్యం జరిగినా, దాని ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తుంది. అదీగాక నిత్యం సిగ్నలింగ్ లోపాలో, మరమ్మతులో, కొత్త పనుల నిర్వహణో, ప్రమాదాలో... ఇలా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ఇది రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతుంది. దీంతో కొన్ని చోట్ల రైళ్లు కొంత సమయం నిలిచిపోతాయి. తిరిగి తన రెగ్యులర్ రూట్ క్లియరెన్స్ సమయం తప్పి బయలుదేరతాయి.
గౌతమి విషయంలో జరిగిందిదే...
హైదరాబాద్‌లోని లింగంపల్లిలో రాత్రి 8.30 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్ కాకినాడకు బయలు దేరాల్సి ఉంటుంది. ఈ రేక్ కేవలం లింగంపల్లి–కాకినాడ మధ్య ప్రయాణానికే పరిమితం కాదు, దీన్ని రేక్ షేరింగ్ పద్ధతిలో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌గా కూడా నడుపుతున్నారు. ముంబై నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లికి 4.20 గంటల్లోపు చేరుకోవాలి. మహారాష్ట్ర నుంచి వచ్చే సమయంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆదివారం ఇది లింగంపల్లి స్టేషన్‌కు సాయంత్రం ఆరున్నర తర్వాత చేరుకుంది. మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకునేసరికి అర్ధరాత్రి దాటింది. తిరిగి గౌతమి ఎక్స్‌ప్రెస్‌గా ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేసరికి తెల్లవారు జామున 3 దాటింది.
⇒ సికింద్రాబాద్–నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి–నర్సాపూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌గా, హుస్సేన్‌సాగర్/పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లను లోకల్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా... పలు ప్రధాన రైళ్లను కూడా రేక్ షేరింగ్ (Rake Sharing) పద్ధతిలో నడుపుతున్నారు. దీంతో ఇవి ఏవీ కూడా గమ్యం చేరిన తర్వాత ఖాళీగా ఒకేచోట ఉండవు.
ఇలాంటివి ఎన్నో...
⇒ కొంతకాలంగా ఘట్‌కేసర్–కాజీపేట మూడో/నాలుగో లైన్ల పనుల కారణంగా, విజయవాడ–గూడూరు సెక్షన్ల పనుల వల్ల లింక్ రేక్ జాప్యం తీవ్రరూపం దాల్చింది.
ఇదీ చదవండి: రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
⇒ లింగంపల్లి–నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ (17256): పగటిపూట నడిచే ఇంటర్‌సిటీ ఆలస్యం కావడం వల్ల, ఈ నైట్ ఎక్స్‌ప్రెస్ పలుమార్లు 3 నుంచి 5 గంటల దాకా ఆలస్యంగా రీషెడ్యూల్ అయింది.
⇒ డోన్–కర్నూలు–కాచిగూడ ప్యాసింజర్ లింకులు: ఇటీవల జరిగిన నాన్–ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా జత రైళ్లు రాక, కనెక్టింగ్ రూట్లలో రైళ్లను పాక్షికంగా రద్దు చేయడమో లేక రెండు గంటల ఆలస్యంగా రీషెడ్యూల్ చేయడమో జరిగింది.
⇒ తిరుపతి రూట్ రైళ్లు: గూడూరు సెక్షన్ పనుల ఎఫెక్ట్‌తో తిరుపతి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైళ్ల రేక్‌లు సకాలంలో రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
⇒ సెప్టెంబర్ 6న హైదరాబాద్–పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఏకంగా 5 గంటలు ఆలస్యంగా నడిచింది.
తప్పనప్పుడు ప్రత్యామ్నాయం కావాల్సిందే...
ఖరీదైన రైళ్లను ఖాళీగా ఉంచటం నష్టంగా మారుతున్నప్పుడు వాటిని రేక్ షేరింగ్ పద్ధతిలో నడిపేందుకు ఇబ్బందేమీ లేదు. కానీ, ఆలస్యం జరిగినప్పుడు ప్రత్యామ్నాయ రేక్‌ను సిద్ధం చేసేందుకు వీలుగా స్పేర్ కోచ్‌ల సంఖ్య పెంచటం అనివార్యం.
ఇదీ చదవండి: తెలుగు యువకుడి బుకింగ్ రైడ్ యాప్
రూ.80 కోట్ల ఆస్తి కావటమే..
⇒ ఒక పూర్తి రైలు కోచ్‌ల (రేక్) తయారీకి రైల్వే రూ.80 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ఇంత భారీ పెట్టుబడి ఉన్న రేక్‌ను కొన్ని గంటలపాటు ఖాళీగా ఉంచటం అంటే నిరర్ధక ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని రైల్వే భావిస్తోంది. వీలైనంత వరకు దాని మీద ఆదాయం పొందటమే లక్ష్యంగా, ఖాళీ సమయంలో వాటిని మరో రూట్ రైలు సేవలకు వినియోగిస్తోంది.
⇒ డిమాండ్‌కు తగ్గట్టుగా కోచ్‌ల ఉత్పత్తి లేకపోవడంతో ఒక రూట్‌కు ఒక డెడికేటెడ్ రైలు అన్న పద్ధతి కష్టంగా మారింది.
⇒ రైలు రేక్‌ను కొన్ని గంటలపాటు నిలిపి ఉంచేందుకు పార్కింగ్ యార్డులకు కొరత ఉంది. చాలా సందర్భాల్లో ఖాళీ రేక్‌ను ఎక్కడ నిలపాలో కూడా తెలియని పరిస్థితి. పార్కింగ్ కొరత ఎదుర్కొనటం కంటే మరో ప్రయాణానికి పంపటం సులువుగా మారింది.


