Mysuru Dasara: తుది ఘట్టం కోసం జనం ఎదురుచూపు! | Mysuru Dasara enters finale with Jamboo Savari | Sakshi
Sakshi News home page

Mysuru Dasara: తుది ఘట్టం కోసం జనం ఎదురుచూపు!

Oct 21 2026 1:34 PM | Updated on Oct 21 2026 2:19 PM

Mysuru Dasara enters finale with Jamboo Savari

బెంగళూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) మైసూర్ దసరా వేడుకల్లో జంబూసవారి కనువిందు చేయనుంది. ఈ ఘట్టంతో ఉత్సవాలు ముగియనున్నాయి. మైసూర్ ప్యాలెస్ నుంచి ప్రారంభమై బన్నీమండపం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగనుంది. ప్యాలెస్ బలరామ ద్వారం వద్ద బుధవారం మధ్యాహ్నం 1.36 నుంచి 1.56 గంటల మధ్య శుభ ముహూర్తంలో నంది ధ్వజానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఈ మహోత్సవ ఊరేగింపును ప్రారంభించనున్నారు.

ఈసారి జంబూ సవారిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 750 కిలోల బంగారు అంబారీని ‘ప్రశాంత’ అనే గజరాజు మొదటిసారి మోయనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 60 ఏళ్లు నిండిన 'అభిమన్యు' ఏనుగును బాధ్యతల నుంచి తప్పించడంతో ఈ మార్పు జరిగింది. ప్యాలెస్ ప్రాంగణంలో సాయంత్రం 4.10 నుంచి 4.35 గంటల మధ్య అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి దేవి ఉత్సవ మూర్తికి ముఖ్యమంత్రి పుష్పార్చన సమర్పించనున్నారు. ఈ ఘట్టంలో ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, ఎంపీ, రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య తదితరులు పాల్గొననున్నారు.

శోభాయాత్రలో కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పలు జానపద కళారూపాలు, ప్రభుత్వ అభివృద్ధిని చాటేలా కేవలం 15 జిల్లాలకు చెందిన శకటాలు పాలుపంచుకుంటున్నాయి. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శకటాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాజవంశీకుడు యదువీర్ సాంప్రదాయబద్ధంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్యాలెస్‌లో 'విజయ యాత్ర' నిర్వహించి బన్నీ చెట్టుకు పూజలు చేయగా, ప్రసిద్ధ 'వజ్రముష్టి కాళగ' (కుస్తీ పోటీ) పలు కారణాల వల్ల ఆలస్యమైంది.

ఇక ప్యాలెస్ ప్రాంగణంలోకి పాస్‌లు, టికెట్లు, గోల్డ్ కార్డులు ఉన్నవారికి మాత్రమే అనుమతి కల్పించారు. రాత్రి 7.30 గంటలకు బన్నీమండపం మైదానంలో కనులవిందుగా ‘టార్చ్‌లైట్ పరేడ్’,‘డ్రోన్ షో’ జరగనున్నాయి. నూతనంగా నియమితులైన గవర్నర్ సుధా యాదవ్ ఈ వేడుకలో గౌరవ వందనం స్వీకరించనుండగా, ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తన్వీర్ సేత్ అధ్యక్షత వహించనున్నారు. 

ఇదీ చదవండి: New York: ‘గర్బా’ నృత్యంలో మమ్దానీ జోష్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement