కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు! | Milk and Curd Gifted to Newlyweds in Mysuru | Sakshi
Sakshi News home page

కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!

Nov 3 2026 1:35 PM | Updated on Nov 3 2026 2:25 PM

Milk and Curd Gifted to Newlyweds in Mysuru

మైసూరు(కర్ణాటక): రాష్ట్రంలో ప్రభుత్వ నందిని పాలు, పెరుగు ధరలను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడిందని చెబుతూ వధూవరులకు విలువైన బహుమతులకు బదులుగా పాల ప్యాకెట్లను కానుకగా ఇచ్చారు. పాల ధరల పెంపుపై వినూత్న రీతిలో ఆందోళనలు జరుగుతున్నాయి. మైసూరులో కడకోళలో  శ్రీ కాళిబీరేశ్వర కళ్యాణ మండపంలో మంజు, అనన్య వివాహం జరిగింది. ఇందులో పాల్గొన్న  ప్రజ్ఞావంత నాగరి వేదిక సభ్యులు నూతన వధూవరులకు పాలు, పెరుగు బహుమతిగా ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నిత్యావసరాలైన పాలు, పెరుగు ధరలను పెంచడం వల్లనే ఇలా చేశామని తెలిపారు.     

పాలు లేని టీ తాగుతూ..  
మైసూరు: పాల ధరలను పెంచారు, ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఛార్జీలను పెంచుతోందని గంధదగుడి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో నిరసన తెలిపారు. పాత కలెక్టర్‌ కార్యాలయం ముందు గుమిగూడిన నిరసనకారులు, పాలులేని టీ తాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. పెంచిన ధరలో రూ.7 రైతులకు వెళితే, మిగిలిన రూ.5 ఎవరికి వెళ్తాయని ప్రశ్నించారు. పెరుగు ధరను లీటరుకు రూ.14 పెంచారు, అది రైతులకు చేరకపోతే ఎవరి జేబుల్లోకి వెళ్తుందని సర్కారుపై మండిపడ్డారు. పేదలు, మధ్యతరగతిపై తీవ్ర భారం మోపారని ఆరోపించారు. ధరల పెంపును తక్షణమే రద్దు చేయాలన్నారు.  

ఇదీ చదవండి: నూడుల్స్‌ కారంగా ఉన్నాయని దాడి

ఖాళీ క్యాన్లతో కేంద్రమంత్రి ధర్నా  
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం నందిని పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచడాన్ని ఖండిస్తూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజె, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు  సోమవారం బెంగళూరు ఫ్రీడంపార్కులో ధర్నా చేశారు. పాల క్యాన్లు, ప్యాకెట్‌లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శోభా  మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు పాలు, పెరుగు ధర పెంచిందని ఆరోపించారు. మధ్య తరగతి ప్రజల జీవనం కష్టమౌతున్న సమయంలో  నిరంతరం ధరలను బాదుతోందన్నారు. ప్రభుత్వం రైతులను కాపాడే బదులు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును రైతులకు ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం గోరక్షణ చేయడం లేదని భక్షణ చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు డబ్బు లేదని, డీజిల్‌ కూడా కొనడానికి కాసుల్లేవని ఆమె దుయ్యబట్టారు. మరోపక్క బీర్, మద్యం ధరలు పెంచిందని, ఏమి రేట్ల పెంచలేదో సర్కారు చెప్పాలని సవాల్‌ చేశారు.

పెరుగు ధర రూ.2 తగ్గింపు: సీఎం
బనశంకరి: నందిని పాలు, పెరుగు ధరల పెంపుపై బీజేపీ సహా పలు సంఘాలు నిరసనలకు దిగడంతో సీఎం డీకే శివకుమార్‌ పునరాలోచనలో పడ్డారు. నందిని పెరుగు ధరను లీటరుపై రూ.2 తగ్గించాలని అధికారులకు సూచించారు. లీటరు పాలపై రూ. 8, పెరుగుపై రూ.14 వరకూ ధర పెరిగింది. డీకే సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ధర పెంచినందుకు కేఎంఎఫ్, జిల్లాల పాల సంఘాల నాయకులు తనను కలిసి ధన్యవాదాలు తెలిపారన్నారు. పెరుగుపై రూ.2 తగ్గించాలని సూచించాను, పాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ధరల పెంపు వల్ల సుమారు 11 లక్షల పాడి రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement