మట్టికుండలో లెక్కలేనన్ని వెండినాణాలు.. సంభాల్‌లో కలకలం! | 150 Year Old Silver Coins Found During Excavation in Sambhal | Sakshi
Sakshi News home page

మట్టికుండలో లెక్కలేనన్ని వెండినాణాలు.. సంభాల్‌లో కలకలం!

Nov 3 2026 9:48 AM | Updated on Nov 3 2026 10:18 AM

150 Year Old Silver Coins Found During Excavation in Sambhal

సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మురుగు కాలువ తవ్వకాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాలువ మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతంలో ఓ మట్టి కుండ బయటపడింది. అందులో బ్రిటిష్  కాలం నాటి వెండి నాణేలు లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. 1875 నాటి విక్టోరియా రాణి కాలానికి చెందినవిగా భావిస్తున్న ఈ నాణేలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

సంభాల్ జిల్లాలోని గున్నౌర్ పరిధిలో ఉన్న జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహన్ ఇంటి వద్ద మురుగు కాలువ తవ్వకాల కోసం ఇద్దరు కూలీలను నియమించారు. పనులు చేస్తుండగా ఓ కూలీకి మట్టి కుండ కనిపించింది. దానిని బయటకు తీసిన అనంతరం అందులోని కొన్ని నాణేలను మరో కూలీకి ఇచ్చాడు. మట్టి కుండలో వెండి నాణేలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు కూలీల మధ్య వాటి పంపకంపై వివాదం తలెత్తింది. ఈ విషయం కాస్తా గ్రామమంతా వ్యాపించింది. దీంతో ఇంటి యజమాని రోహన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 70 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు 1875 సంవత్సరానికి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించారు. విక్టోరియా రాణి పాలన కాలంలో చెలామణిలో ఉన్న నాణేలుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కొత్వాలి ఎస్ఎస్ఐ సందీప్ మాలిక్ స్పందించారు. నాణేల లభ్యత గురించి పురావస్తు శాఖకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖకు పోలీసులు లేఖ కూడా రాశారు. నాణేల అసలు ప్రామాణికత, వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని పురావస్తు నిపుణులు పరిశీలించనున్నారు. వారి పరిశీలన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: మరో నీట్‌ విద్యార్థిని బలవన్మరణం.. 10 పేజీల లేఖలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement