లక్నో: ఇతరుల భవిష్యత్తును చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన ఇందు ప్రకాశ్ మిశ్రా.. ఆయన భార్య జాతకాన్ని వేద జ్యోతిష్యంలో అంచనా వేయలేకపోయారా?, లేకపోతే యురేనెస్, నెప్ట్యూన్, ఫ్లూటో వంటి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ గణాంకాలు ఆయనకు అందలేదా? అనేదే ప్రస్తుత చర్చ. అందరి జాతకాలను చేతి వేళ్ల మీద లెక్క కట్టే యూపీకి చెందిన ఇందు ప్రకాశ్ మిశ్రా.. ఆయన భార్య విషయంలోకి వచ్చేసరికి చతికిలబడ్డారు.
ఇక్కడ మనం గమనించాల్సినదేంటంటే.. ‘సొంత వైద్యం డాక్టర్‌కి సైతం పని చేయదట’ అనే నానుడే నిజమైందనేది. ఎందుకంటే ఇందు ప్రకాశ్ మిశ్రా భార్య స్మితా మిశ్రా ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి పాలవ్వడమే ఇందుకు కారణం.
ఉత్తరప్రదేశ్ శాసనమండలిలోని లక్నో డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు 300 ఓట్లు కూడా దక్కలేదు. దీంతో ఈ ఫలితం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాంతి సింగ్ విజయం సాధించారు.
తొలుత కాంగ్రెస్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన స్మితకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. ఓటమి అనంతరం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు. అంతేకాదు కొన్ని బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్ల సంఖ్య, వాటిపై పేర్కొన్న సంఖ్యతో సరిపోలలేదని, మరికొన్ని బాక్సుల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ బ్యాలెట్ పత్రాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు.
అయితే ఈ విషయంపై మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఇతరుల భవిష్యత్తును అంచనా వేసే జ్యోతిష్యుడి భార్య ఎన్నికల్లో కనీసం 300 ఓట్లు కూడా సాధించలేకపోయిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇతరులకి భవిష్యత్తు చెప్పే ఆయన తన భార్య రాజకీయ భవిష్యత్తును ముందే ఊహించలేకపోయారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఓసీఐ కార్డుపై ఇమ్రాన్ ఖాన్ పోరాటం


