రింకూ సింగ్, పృథ్వీ షా (PC: BCCI Domestic/X)
రంజీ ట్రోఫీ 2026-27 తాజా మ్యాచ్‌లలో ఉత్తరప్రదేశ్ స్టార్ రింకూ సింగ్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యారు. ఇద్దరూ డకౌట్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. తాజా రంజీ ఎడిషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడింది.
వరుస సెంచరీలతో చెలరేగిన రింకూ
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ శతకం (112)తో రాణించి.. యూపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యూపీ బిహార్‌పై ఇన్నింగ్స్, 267 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం గోవాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ రింకూ శతక్కొట్టాడు. అజేయ సెంచరీ (118)తో జట్టును గెలిపించాడు.
తాజాగా డకౌట్
అయితే, తాజాగా సోమవారం పుదుచ్చేరితో మొదలైన మూడో రంజీ మ్యాచ్‌లో మాత్రం రింకూ సింగ్ తుస్సుమనిపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెప్టాండర్ బ్యాటర్.. రెండు బంతులు ఎదుర్కొని.. పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లు అంకిత్ శర్మ బౌలింగ్‌లో మోహిత్ కాలేకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 67 పరుగులే చేయగలిగింది.
అదే బాటలో పృథ్వీ షా
మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పృథ్వీ షా కూడా విఫలమయ్యాడు. పుణె వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా రెండు బంతులు ఎదుర్కొని.. చింతన్ గజా బౌలింగ్‌లో ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మహారాష్ట్ర సోమవారం ఆట పూర్తయ్యేసరికి.. వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
కాగా తాజా సీజన్‌లో మహారాష్ట్ర తొలి మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టుతో తలపడగా.. పృథ్వీ షా 70, 7 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. ఇక జార్ఖండ్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా 21 పరుగులకే పరిమితం కాగా.. మ్యాచ్ డ్రా అయింది.


