source: X
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ బృందంలో మరో కీలక మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గారెత్ బ్యాటీని జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మైఖేల్ హస్సీ స్థానంలో బ్యాటీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇప్పటికే జట్టు ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్‌ను, బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మను నియమించిన విషయం తెలిసిందే.
త్వరలో అధికారిక ప్రకటన..?
జహీర్ ఖాన్‌తో బ్యాటీకి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోని వోర్సెస్టర్‌షైర్ తరఫున కలిసి ఆడిన అనుభవం ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ఈ నియామక చర్చలకు దోహదపడినట్లు తెలుస్తోంది.
బ్యాటీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాశీ విశ్వనాథన్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది.
కోచ్‌గా బ్యాటీకి మంచి అనుభవం
49 ఏళ్ల గారెత్ బ్యాటీ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 10 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 261 మ్యాచ్‌లు ఆడి 682 వికెట్లు పడగొట్టడంతో పాటు 7,399 పరుగులు సాధించాడు.
ప్రస్తుతం బ్యాటీ సర్రే జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శకత్వంలో సర్రే వరుసగా మూడుసార్లు కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు గెలుచుకుంది. గస్ అట్కిన్సన్, విల్ జాక్స్, ఒల్లీ పోప్, జేమీ స్మిత్ వంటి ఆటగాళ్లు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపిక కావడంలో ఆయన కోచింగ్ కీలకపాత్ర పోషించింది.
ఇదీ చదవండి: పాక్ జట్టులో కీలక మార్పు.. విధ్వంసకర బ్యాటర్‌పై వేటు


