source: X
పాక్ వన్డే జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. విధ్వంసకర బ్యాటర్ సైమ్ అయూబ్ స్థానంలో మరో స్టార్ బ్యాటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంకతో జరుగుతున్న ట్రై సిరీస్ నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. వరుసగా విఫలమవుతున్న సైమ్ అయూబ్‌ను గాయం కారణంగా కాకుండా, వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా జట్టు నుంచి తప్పించారు.
దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సైమ్ అయూబ్ ఆసక్తి
ఈ సిరీస్‌లో సైమ్ అయూబ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 21 పరుగులే చేశాడు. ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ 8 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి సైమ్ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్‌తో చర్చించిన అనంతరం సైమ్‌ను జట్టు నుంచి విడుదల చేసి, ఫర్హాన్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
అద్భుత ఫామ్‌లో ఫర్హాన్
సాహిబ్జాదా ఫర్హాన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 238 పరుగులు చేసి, మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫర్హాన్ ఇటీవలే పాక్ టీ20 జట్టు కెప్గెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఇదిలా ఉంటే, స్వదేశంలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో పాక్ ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించింది. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ చిరస్మరణీయ విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం శ్రీలంక, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఇప్పటికే 3 మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్ ఏదైనా అద్భుతం జరిగితేనే ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తిశర్మ


