అమ్మ వంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎంత ఖరీదైన భోజనమైనా అమ్మ వంట ముందు బలాదూర్. ఆ విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఔనంటూ అమ్మ వంటకే నూటికి నూరు మార్కులు వేసేస్తున్నాడు. అంతేగాదు తను క్రికెట్ పర్యటనల కారణంగా అమ్మ వంట ఎంతలా మిస్ అయ్యేవాడో..ఎలా మళ్లీ ఆ కమ్మని భోజనాన్ని ఆస్వాదించేవాడో సొషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇలా. తనకు అమ్మ వంట అంటే ఎంత ఇష్టమో చెబుతూ..తను కుటుంబానికి దూరంగా గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ..తను ఇంటికి వచ్చే ముందు ఏం వంటకాలు కావాలో అమ్మకు ఫోన్‌లోనే వివరించేవాడినని అన్నారు.
అంతేగాదు సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలపై ఉన్న ప్రేమను అభిమానులకు తెలియజేస్తూ..తన క్రికెట్ పర్యటనల కారణం అమ్మ భోజనాన్ని బాగా మిస్ అయ్యేవాడినని అన్నారు. తనకు నచ్చిన వంటకాలు సిద్దంగా ఉండేలా కనీసం రెండు లేదా మూడు రోజులు ముందుగానే ఇంటికి ఫోన్ చేసి ఏమి తినాలనుకుంటున్నానో అమ్మకి చెప్పేవారట. తను ఎక్కువుగా పప్పు, బియ్యం, సాంప్రదాయ మహారాష్ట్ర వంటకం అయిన వరణ్ భాత్, బంగాళదుంపలతో చేసే బటాటా భాజీ తదితరాలంటే ఇష్టమట.
అలాగే తన తల్లి ప్రత్యేకంగా చేసే ఒక మిశ్రమాన్ని గుర్తు చేసుకుంటూ..తరతరాలుగా కుటుంబంలో ఆచారంగా చేసే రెసిపీనే అయినా..ఆమె చేతితో చేసిన ఆ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. నెయ్యి వేసి చేతులతో తినడం వల్ల ఆ భోజనం మరింత ప్రత్యేకంగా ఉండేదంటూ తన సంభాషణను ముగించారు. ఎంతటి ఘనుడైనా..ఓ అమ్మకి కొడుకే అన్నది జగమెరిగిన సత్యం అని మరోసారి నిరూపితమైంది కదూ.
ఇదీ చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి వ్యాపార అధ్యక్షురాలి రేంజ్‌కు..! ఆమె సక్సెస్ మంత్ర ఇదే..


